ఖమ్మం, ఏప్రిల్ 23: పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మీద గవర్నర్‌కు తప్పుడు ఫిర్యాదు చేయడాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఖమ్మంలో 20 ఏళ్లుగా నడుస్తున్న మమత మెడికల్ కాలేజిలో పీజీ అడ్మిషన్లు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లు జరుగుతున్నా కౌన్సెలింగ్ అలాట్మెంట్ సమయంలోనే తమ కాలేజీలో సీట్లు నిండిపోతుంటాయని చెప్పారు. అలాంటప్పుడు కళాశాల యజమాన్యం బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవకాశమే లేదన్నారు.
రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఒకవేళ తన కాలేజీలో ఒక్క సీటునైనా బ్లాక్‌లో దందా చేసినట్టు రేవంత్‌రెడ్డి నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ నిరూపించని పక్షంలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకురాసి క్షమాపణలు చెప్పి తన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలకు రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉండాలన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న తన కాలేజీ ప్రతిష్టను మంటగలిపే దుర్మార్గపు చర్యలను తిప్పికొడతామని మంత్రి పువ్వాడ అన్నారు.