ఖమ్మం ఏప్రిల్ 13: ధాన్యం కొనుగోలుపై కేంద్రం ససేమిరా అన్నది.. వడ్లు కొనాలని ఢిల్లీ వెళ్లి అడిగిన మంత్రులను అవమానించింది.. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అనుచిత వ్యాఖ్యలు చేసింది.. ఇక్కడి రైతులపై పూర్తి వివక్ష చూపింది.. రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది.. అయినా.. సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని మంగళవారం మీడియా సాక్షిగా ప్రకటించారు.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ ప్రకటనపై ఉమ్మడి జిల్లా రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. బుధవారం పది నియోజకవర్గాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దేశంలో రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం ప్రకటించిన సందర్భంగా బుధవారం ఖమ్మం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచాలని చూస్తుంటే, కేసీఆర్ వారికి అండగా నిలిచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రకటించారన్నారు. ఏమాత్రం దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటుందన్నారు. కొనుగోలుకు ప్రభుత్వంపై రూ.15 వేల కోట్ల భారం పడినప్పటికీ, సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం నేతలు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, శీలంశెట్టి వీరభద్రం, అంజిరెడ్డి, టీఆర్ఎస్ రఘునాథపాలెం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వీరునాయక్, కార్పొరేటర్లు కురాకుల వలరాజు, బుడిగెం శ్రీను, బుర్రి వెంకట్, పగడాల శ్రీవిద్య, దాదే అమృతమ్మ నాయకులు కృష్ణ చైతన్య, తాజుద్దీన్ , మందడపు సుధాకర్, షకీనా, కిశోర్, మాటేటి కిరణ్, బలుసు మురళీకృష్ణ, ముక్తార్ షేక్ పాల్గొన్నారు.