కరకగూడెం, ఏప్రిల్ 5: ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. కరకగూడెంలోని రైతువేదికలో మంగళవారం 30 కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యనైనా నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చన్నారు. దశాబ్దాల పాటు పాలించిన పార్టీలు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తారన్నారు.
రానున్న రోజుల్లో భవిష్యత్తు టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతోమంది గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. దీనిలో భాగంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధణ సాధ్యమైందన్నారు. రైతు సంక్షేమమే దేశంలో ఎక్కడాలేని విధంగా పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నదన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలోఎంపీపీ రేగా కాళిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు కొలేటి భవానీ శంకర్, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, రాము, రామలింగం, నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.