గౌరారం టోల్గేట్ వద్ద పెరుగనున్న చార్జీలు
ప్రతి వాహనంపై రూ.5 అదనపు భారం
నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు
బొగ్గు లారీలు, ఆర్టీసీ బస్సులపై పెనుభారం
ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు టోల్ చార్జీలు మరింత భారం కానున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం.. భద్రాద్రి జిల్లా రుద్రంపూర్ వరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. వీటిని అనుసంధానం చేస్తూ గౌరారం వద్ద నేషనల్ హైవే అధికారులు రెండేళ్లక్రితం టోల్గేట్ ఏర్పాటు చేశారు. ఏటా ప్రతి వాహనంపై రూ.5 పెంచేందుకు కేంద్రం నిర్వాహకులకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది నేటి అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలను వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే, పెరిగిన చార్జీల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గు రవాణా చేసే లారీలపై పడనున్నది. ఆర్టీసీ బస్సులకు టోల్‌చార్జీలు ప్రియం కానున్నాయి. గౌరారం టోల్గేట్ నుంచి సుమారు 300 లారీలు.. ఒక్కో లారీ మూడు నుంచి నాలుగు ట్రిప్పులు సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు బొగ్గురవాణా చేస్తుంటాయి.
ప్రతి లారీ ఒక వైపు ప్రయాణం చేస్తే నిర్వాహకులు రూ.195 వసూలు చేస్తుండగా.. ఇక నుంచి రూ.200 వసూలు చేయనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో అదేలారీకి రూ.95 వసూలు చేస్తుండగా.. ఇకనుంచి రూ.100 వసూలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సులకు రూ.125 వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.130 వసూలు చేయనున్నారు. భారీ వాహనాలకు వాటి సామర్థ్యాన్ని బట్టి రూ.135 వరకు వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.140 వసూలు చేయనున్నారు. గౌరారం టోల్గేట్ ద్వారా రోజుకు సుమారు రూ.3.30 లక్షలు వసూలవుతున్నది. పెరిగిన టోల్ చార్జీలతో మరో రూ.లక్ష అదనంగా ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు.