వేంసూరు, మార్చి 15 : ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని మర్లపాడు, రాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చేపలచెరువు మూలమలుపు వద్ద మినీ లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని కుంచపర్తి గ్రామానికి చెందిన మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి(45) తన తండ్రి మద్దిరెడ్డి కృష్ణారెడ్డి(65)ని సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా తిరువూరు వైపు వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. మినీ లారీ పల్టీలు కొట్టి పక్క పొలాల్లోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్న ఐదుగురిలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. వారిని సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మినీ లారీ కామవరపుకోట అడమల్లి గ్రామానికి చెందినదిగా ఎస్సై సురేశ్ తెలిపారు. శ్రీనివాసరెడ్డికి ఇద్దరు కుమార్తెలు కాగా ఇటీవలే చిన్న కుమార్తెకు వివాహం చేశాడు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ కరుణాకర్ సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.