మూడు అంతస్తుల్లో రూ.20 కోట్ల నిధులతో నిర్మాణం
మంత్రి అజయ్ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పనులు
ఈనెలాఖరులోపు పూర్తి..మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఏర్పాట్లలో నిమగ్నమైన మున్సిపల్ అధికారులు
ఖమ్మం, మార్చి 18: ఖమ్మంలోని ప్రస్తుత నగరపాలక సంస్థ కార్యాలయ భవనం నైజాం కాలంలో పరిమిత స్థలంలో రూపుదిద్దుకున్నది. అప్పటి జనాభాకు కార్యాలయం అనువుగా ఉండేది. కానీ ప్రస్తుతం నగర జనాభా 4 లక్షలకు చేరింది. 60 డివిజన్లు ఏర్పాటయ్యాయి. రూరల్ ప్రాంతంలోని పలు గ్రామాలు నగరంలో విలీనమయ్యాయి. దీంతో నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసేవ ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దీనికి తోడు కార్యాలయ ఆవరణలోనే మీ సేవ కేంద్రం, బ్యాంకు ఉండడంతో రద్దీ బాగా పెరిగింది. పార్కింగ్ ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కౌన్సిల్ సమావేశాలు జరిగే రోజుల్లో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగరపాలక సంస్థకు చెందిన ట్రాక్టర్లు, జేసీబీలు, ట్రాలీలనూ కార్యాలయ ఆవరణలోనే పార్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో ప్రభుత్వం నగరంలోని గట్టయ్యసెంటర్‌లో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
రూ..20 కోట్లతో నిర్మాణం..
2014లో పువ్వాడ అజయ్‌కుమార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖమ్మం నగరాభివృద్ధిపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నగరాభివృద్ధికి బాటలు వేశారు. ఇదే ఒరవడిలో 2017లో నగరంలోని గట్టయ్య సెంటర్లోని మూడెకరాల స్థలంలో నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసింది. టెండర్ ప్రకియ ముగిసిన తర్వాత మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి మరో రూ.4 కోట్లు విడుదల చేయించారు. మంతిర అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని అనేకసార్లు నిర్మాణంపై సమీక్షించారు. స్వయంగా భవనాన్ని పరిశీలించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం నిర్మాణం తుది దశకు చేరుకున్నది. కార్యాలయాన్ని ఈనెలాఖరులోపు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మూడు అంతస్తుల్లో భవనం..
భవనం మూడు అంతస్తుల్లో ని రూపుదిద్దుకున్నది. భవనం పరిధిలో రెండు లిఫ్టులు ఏర్పాటయ్యాయి. వీటిలో ఒకటి అధికారుల కోసం. రెండోది ప్రజల కోసం. ఒకటో అంతస్తులో కమిషనర్ చాంబర్, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగాలు, రెండో అంతస్తులో సుడా చైర్మన్ చాంబర్, వివిధ సెక్షన్ల విభాగాలు, మూడో అంతస్తులో నగర మేయర్ చాంబర్, గ్రౌండ్ ఫ్లోర్లో సిటిజన్ చార్టర్, మీ సేవ కేంద్రం, గ్రీవెన్స్ సెల్ విభాగం ఉంటుంది. సమావేశాలకు ప్రత్యేకంగా కౌన్సిల్ హాల్ ఏర్పాటైంది. అన్ని అంతస్తుల్లో సెంట్రల్ ఏసీ పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఆధునిక మరుగుదొడ్లు, అధునాతనమైన ఫర్నీచర్, గ్రానైట్ ఫ్లోరింగ్‌తో భవనం పనులు తుది దశకు చేరుకున్నాయి. కార్యాలయ ఆవరణలో అధికారులు గ్రీనరీకి ప్రాధాన్యం ఇచ్చారు.
హైదరాబాద్‌కు దీటుగా నగరాభివృద్ధి..
గతంలో నగరంలో అరకొరగా ప్రజా మరుగుదొడ్లు, ఇరుకు రోడ్లు, చిన్న బస్టాండ్, పరిమితమైన స్థలంలో కూరగాయల మార్కెట్లు ఉండేవి. సరైన మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతున్నది. మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని నగరాభివృద్ధికి కృషి చేశారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి వందలాది కోట్లతో విశాలమైన బస్టాండ్, సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయించారు. ప్రజామరుగుదొడ్లు, శాశ్వత డ్రైన్లు, విశాలమైన రోడ్లు, పార్క్‌లు, వంతెనలు నిర్మించారు.