ఈ విడత జాబితాలో పేరు రాని వారెవరూ అధైర్య పడొద్దు
స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు
కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ మధు
జూలూరుపాడు/ కారేపల్లి, మార్చి 16: దశల వారీగా అర్హులందరికీ దళితబంధు ఫలాలు అందుతాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. దళితబంధు లబ్ధిదారుల జాబితాలో ఈ విడతలో పేర్లు రానివారెవ్వరూ అధైర్య పడొద్దని సూచించారు. దళితబంధు పథకానికి రాష్ట్ర బడ్జెట్లో అధిక నిధులు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జూలూరుపాడులో బుధవారం నిర్వహించిన దళిత కృతజ్ఞతా సభలో వారు మాట్లాడారు. ఈ పథకంతో దళితుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. అలాగే స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షల సాయం అందిస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం రూ.3 వేలు చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం అభినందనీయమన్నారు. ఎంపీపీ సోని, జడ్పీటీసీ కళావతి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయండి..
మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. జూలూరుపాడులోని ఎంపీడీవో కార్యాలయ సమావేశమ మందిరంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీపీ సోని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు, తహసీల్దార్ లూథర్ విల్సన్, జడ్పీటీసీ కళావతి, వైస్ ఎంపీపీ విజయనిర్మల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలు ఆదర్శం..
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దార్ కోట రవికుమార్, ఎంపీపీ శకుంతల, జడ్పీటీసీ జగన్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.