సెర్ప్, మెప్మా ఉద్యోగులకు పెరుగనున్న వేతనాలు
418 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లోకి..
632 మంది వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
2,429 మంది ‘మధ్యాహ్న’ కార్మికులకు గౌరవ వేతనం
ఆనందోత్సాహాల్లో ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది
జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫెక్ల్సీలకు క్షీరాభిషేకాలు
మామిళ్లగూడెం, మార్చి 16: సీఎం కేసీఆర్ వరుస ప్రకటనలతో నిరుద్యోగులు, ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులు ‘జయహో కేసీఆర్’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం తొలగించబడిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. వీఆర్ఏలను ఇరిగేషన్ విభాగంలోకి తీసుకుంటామని, అర్హతలను బట్టి ఉద్యోగోన్నతులు కల్పిస్తామని వివరించారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు. సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం పీఆర్సీని అమలు చేసి వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీంతో ఆయా విభాగాల ఉద్యోగులు, సిబ్బంది నుంచి హర్షాతికేతాలు వెల్లువెత్తున్నాయి. దీంతో వారంతా బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామంటూ ప్రతినబూనారు.
ఏయే విభాగాల్లో ఎంతమందంటే..
ఖమ్మం జిల్లాలో వివిధ కారణాలతో తొలగించబడిన 418 ఈజీఎస్ పీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. కొంత కాలంగా ఎదురుచూస్తున్న 632 మంది వీఆర్ఏలకు వారి అర్హతలను బట్టి ఉద్యోగోన్నతులు ఇవ్వనున్నారు. ఇరిగేషన్ శాఖలో లష్కర్లుగా నియమించనున్నారు. 2,429 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే చెల్లిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలకు పెంచనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో 180 మందికి, మెప్మాలో 240 మందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం, పీఆర్సీ అందించనున్నారు.