నేలకొండపల్లి, నవంబర్ 18 : మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి జడ్పీఎస్ఎస్, పీఎస్‌లలో జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి తరగతి గదిలో విద్యార్థుల కోసం తప్పనిసరిగా నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తరగతులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించి వారి సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీఎస్ఎస్ హెచ్ఎం సమాధానం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్, సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, డీఈవో యాదయ్య, ఎంఈవో రాములు, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎన్‌హెచ్ అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న రహదారిపై ప్రయాణిస్తూ పలుచోట్ల కలెక్టర్ ఆగి రోడ్డును పరిశీలించి ఎన్‌హెచ్ అధికారులకు సూచనలు చేశారు.