అభివృద్ధి బాటలో గౌతంపూర్
కంపోస్ట్ తయారీలో భద్రాద్రి జిల్లాలోనే ముందంజ
ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అది కార్మిక ప్రాంతం. బొగ్గు బావులు, ఓపెన్ కాస్టు గనుల ప్రభావిత ప్రాంతం. అయితే.. ఏంటి..! పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఆ గ్రామమే చుంచుపల్లి మండలంలోని గౌతంపూర్. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి పథకంతో గ్రామ స్వరూపమే మారిపోయింది. 4,400 జనాభా, 1,350 ఇండ్లు ఉన్న గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది.
ఆహ్లాదంగా వనాలు..
పల్లె పకృతి వనంలో 4,500 మొక్కలు పెరుగుతున్నాయి. గ్రామస్తులకు పచ్చందాలను పంచుతున్నాయి. దీంతో పాటు ‘కోటి వనం’లో నాటిన 2 వేల మొక్కలు, అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటుతున్న 800 మొక్కలు గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామ సిబ్బంది నిత్యం మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. గ్రామంలోని వనాల్లో ఉదయం, సాయంత్రం సందడి నెలకొంటున్నది. గ్రామస్తులు ఉదయం సాయంత్రం వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. పెద్దలు సేద తీరుతున్నారు. చిన్నారులు ఆడుతూ సందడి చేస్తున్నారు. ఇటీవల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ అనుదీప్, జిల్లా పంచాయతీ అధికారులు మొక్కల పెంపకం, స్వచ్ఛ భారత్‌పై సర్పంచ్ సుజాతను అభినందించారు.
తడి చెత్తతో కంపోస్టు ఎరువు..
గ్రామంలోని డంపింగ్ యార్డులో పారిశుధ్య సిబ్బంది తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పక్కాగా చేపడుతున్నారు. కంపోస్ట్ ఎరువు తయారీలో గౌతంపూర్ జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. గ్రామంలో అన్ని వసతులతో వైకుంఠధామం ఏర్పాటైంది. గ్రామ సిబ్బంది గ్రామంలోని పాడుపడిన బావులు, శిథిల భవనాలను తొలగించారు.
పంచాయతీకే కొత్త కళ..
పల్లె ప్రగతితో కార్మిక ప్రాంతం కళకళలాడుతున్నది. గౌతంపూర్ కొత్త పంచాయతీగా రూపుదిద్దుకున్న తర్వాత గ్రామ రూపురేఖలే మారిపోయాయి. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక ఏర్పాటయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామానికి ప్రత్యే క ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. పంచాయతీకే కొత్త కళ వచ్చింది.
– సయ్యద్ ఇస్మాయిల్, గౌతంపూర్ గ్రామస్తుడు
మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు..
ప్రభుత్వ సహకారంతో మన్ముం దు గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. సర్కార్ విడు దల చేస్తున్న నిధులతో ఇప్పటికే గ్రామంలో డంపింగ్ యార్డు, వనాలు, వైకుంఠ ధామం నిర్మించాం. ట్యాంకర్ ద్వారా మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెడుతున్నాం. ట్రాక్టర్ ద్వారా పక్కాగా పారిశుధ్య నిర్వహణ చేపడుతు న్నాం.
–పొడియం సుజాత, గౌతంపూర్ సర్పంచ్