ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. గతంలో ప్రాథమిక పాఠశాలగా ఉండేది. గ్రామస్తులు, పేరెంట్స్ కమిటీ సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గా తీర్చిదిద్దుకున్నది. బడిలో ఒనగూరిన సౌకర్యాలు, దాతల దాతృత్వం గురించి తెలుసుకోవాలంటే బోనకల్లు మండలంలోని రావినూతల ఉన్నత పాఠశాలను సందర్శించాల్సిందే.
-బోనకల్లు, మార్చి 10
బోనకల్లు, మార్చి 10: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతలు చేయూత తోడైతే ఫలితం ఎలా ఉంటుందో చెబుతోంది ఈ ప్రభుత్వ పాఠశాల. సౌకర్యాల కల్పన సర్కారు కర్తవ్యమేనని అనుకోకుండా పెద్దలు సైతం దాతృత్వాన్ని అందించారు. ఫలితంగా విద్యాభివృద్ధికి బాటలు పడ్డాయి. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందింది. వారు ఉన్నత శిఖరాలకు చేరువయ్యారు. పాఠశాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారు. ఫలితంగా ఆ బడి. జిల్లాకే ఆదర్శంగా నిలిచింది. అదే బోనకల్లు మండలం రావినూతనల గ్రామంలోని ‘కొమ్మినేని నర్సయ్య, పార్వతమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల’. 1980 వరకూ అది ప్రాథమిక పాఠశాలగానే ఉండేది. దీంతో తమ ఊరికి ఉన్నత పాఠశాలను సైతం సాధించాలనుకున్నారు గ్రామస్తులు. దీంతో గ్రామస్తులు, పేరెంట్స్ కమిటీ ద్వారా ఏడాదికి ఒక తరగతి చొప్పున ఉన్నత పాఠశాలను సాధించుకున్నారు. గ్రామస్తులు, దాతలు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి బాటలు వేశారు. ఉన్నత పాఠశాలగా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ పాఠశాలకు దాతల సహకారం అందుతూనే ఉంది. దీంతో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి.
ఇదే గ్రామానికి చెందిన కొమ్మినేని నర్సయ్య, పార్వతమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులతోపాటు తేళ్ల సుకుమోటో ఫౌండేషన్ వారు ఈ పాఠశాల అభివృద్ధికి దాదాపు కోటి రూపాయలకు పైగానే విరాళాలు అందించారు. 2001లో రూ.2 లక్షలతో విద్యార్థుల కోసం 60 డెస్క్ బల్లలు, 10 కుర్చీలు, 12 టేబుళ్లు, రెండు ఇనుప బీరువాలు అందించారు. 2002లో రూ.3.60 లక్షలతో పాఠశాల కార్యాలయ భవననాన్ని, ఒక గదిని నిర్మించారు. 2006లో రూ.14,00,597తో మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేశారు. రూ.1.75 లక్షలతో 56 డెస్క్ బల్లలు సమకూర్చారు. రూ.5 వేల డాలర్ల (అమెరికన్ కరెన్సీ)తో బాలికల కోసం టాయిలెట్లను నిర్మించారు. మంచినీటి సదుపాయం కోసం రూ.1.50 లక్షలతో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 2015లో 500 పుస్తకాలతో గ్రంథాలయాన్ని, రూ.50 వేలతో పాఠశాలకు ల్యాప్‌టాప్ సౌకర్యాన్ని, రూ.1.50 లక్షలతో మెయిన్‌గేట్ ద్వారాన్ని, 2018లో రూ.4.19 లక్షలతో కంప్యూటర్లు, కంప్యూటర్ ల్యాబ్‌ను, ఫర్నీచర్ వంటి సదుపాయాలను కల్పించారు. 2019లో రూ.21 లక్షలతో కొమ్మినేని నర్సయ్య కుమారుడు ప్రొఫెసర్ కొమ్మినేని రామయ్య పేరుతో సైన్స్‌ల్యాబ్‌ను, గ్రంథాలయం గదిని, ప్రహరీగోడను నిర్మించారు. తేళ్ల సుకుమోటో ఆధ్వర్యంలో వారి కుమారుడు విజయ్‌కుమార్ రూ.1.50 లక్షలతో ఫర్నీచర్ కోసం విరాళం అందించారు.
ఊటుకూరి కనకమ్మ, రాధాకృష్ణ జ్ఞాపకార్థం 2016లో శాశ్వత నిధి కింద రూ.లక్షను పాఠశాల పేరిట డిపాజిట్ చేశారు. ఊటుకూరు రంగారావు, లలితాబాయి జ్ఞాపకార్థం మరో రూ.లక్షను ఊటుకూరి జానకీరామారావు, ప్రభావతి అందించారు. హైస్కూల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చెన్నా లక్ష్మీనరసింహారావు రూ.2 లక్షలతో కళావేదికను నిర్మించారు. నాటి సర్పంచ్ షేక్ వజీర్ ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రాంగణం కోసం 2.10 కుంటల భూమిని దాతల విరాళాలతో కొనుగోలు చేసి భవన నిర్మాణాలు చేపట్టారు. గ్రామానికి చెందిన గుర్రం రాజగోపాలం, గుర్రం వెంకటేశ్వర్లు, గుర్రం పూర్ణచంద్రరావు రూ.1.25 లక్షలతో పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి సర్పంచ్ షేక్ వజీర్ టీవీని అందించారు. పూర్వవిద్యార్థులు జాతీయ నాయకుల వాల్‌పెయింట్స్ వేయించారు. పలు నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది.
ఈ పాఠశాలలో 6 నుంచి 10 తరగతుల్లో 150 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 16 మంది ఉపాధ్యాయులున్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో బోధన కొనసాగుతోంది. విద్యార్థులు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా ఈ పాఠశాల ‘మన ఊరు – మన బడి’ ఎంపిక కావడంతో మరిన్ని సౌకర్యాలు అందనున్నాయి.
‘మన ఊరు – మన బడి’ ద్వారా మా పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుంది. డైనింగ్ హాల్, సైకిల్‌స్టాండ్, బాయ్స్ టాయిలెట్లు, రెండు అదనపు గదులు, కంప్యూటర్ ఫ్యాకల్టీ, వాల్‌పెయింట్స్ వంటివి ఏర్పాటైతే ఇక మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వ్తాయి. దాతలు, ప్రభుత్వ లక్ష్యాలను సాధిస్తూ ఈ పాఠశాల ముందుకు సాగుతుంది.
-ఇందిరాజ్యోతి, ఎంఈవో, హెచ్ఎం
నాడు దాతలు ఇచ్చిన విరాళాలతో ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే దాతలు ముందుకొచ్చి పేద పిల్లలకు విద్యను అందించేందుకు కృషిచేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బాగు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ ద్వారా మరిన్ని నిధులు వెచ్చించనున్నారు. ఫలిలంగా మరిన్ని సౌకర్యాలు సమకూరుతాయి.
-కొమ్మినేని ఉపేందర్, సర్పంచ్, రావినూతల