ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 13 : పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. నేటితరం దానికి దూరమవుతున్నది. పుస్తకం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది.. ఎన్నో అనుభూతుల్ని పంచుతుంది.. అవగాహనను పెంచుతుంది.. అన్నింటా తోడుగా నిలుస్తుంది.. పుస్తకం లేని గది శరీరం లేని ఆత్మ వంటిది. వ్యక్తిని వివేకవంతుడిగా మార్చాలన్నా, వ్యవస్థను వికాసవంతం చేయాలన్నా పుస్తకంతోనే సాధ్యం. ఒక పుస్తకం కొన్ని మెదళ్ళను కదిలించే ఆయుధమని, కాలక్రమేణ వస్తున్న మార్పులతో నేడు పుస్తక పఠనం తగ్గిపోయింది. సోషల్ మీడియాతో సమయాన్ని వృథా చేసుకుంటు, పుస్తకాలు చదవడం తగ్గిపోయింది.
యువత పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నది డబ్బు, బంగారం కంటే విలువైన జ్ఞానాన్ని సంపాందించేందుకు పుస్తక పఠనం దోహదం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. పుస్తకం విజ్ఞాన వినోదాల సమాహారం, పుస్తక పఠనం ప్రగతికి మార్గదర్శకం. మంచి పుస్తకాన్ని మించిన నేస్తం లేదంటారు. ఉత్తమ లక్ష్యసాధనకు కృషి చేసేవారు వివిధ పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలువడానికి పుస్తకాలే ఆధారం. అలాంటి అమూల్య గ్రంథాలను ఒకే దగ్గర కూర్చి ఏర్పాటు చేసే నిలయమే గ్రంథాలయం. జిల్లా కేంద్రంలో ప్రధాన గ్రంథాలయంతో పాటు పలు మండల కేంద్రాల్లో గ్రంథాలయాలున్నాయి.
ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్లకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులంరూ గ్రంథాలయం కేంద్రంగానే ప్రిపేరు అవుతున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాయలంలో పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచారు. రూ.25 లక్షలతో గ్రంథాలయంపైన మరో గది నిర్మాణం చేపడుతున్నారు. నేలకొండపల్లిలో ప్రస్తుత భవనం కూల్చివేసి రూ.30 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వైరా గ్రంథాయలంలో రూ.40 వేల విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సత్తుపల్లిలో గ్రంథాలయంలో ఇటీవల దాతలు పుస్తకాలను అందజేశారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 20 వరకు 55వ జాతీయ గ్రంథాయల వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు వారోత్సవాలను సోమవారం ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించనున్నారు. ఈ నెల 14న 1 నుంచి 6 తరగతుల విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, 15న 5 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 16న గ్రంథాలయంపై అవగాహన ర్యాలీ, 17న వక్తృత్వ పోటీలు, 18న పెయింటింగ్ పోటీలు, 19న 6నుంచి 10వ తరగతి బాలికలకు మ్యూజికల్ చైర్స్, రంగోళి పోటీలు నిర్వహించనున్నారు.