సీఎం కేసీఆర్ ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.. రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇప్పటికే పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రిలను బలోపేతం చేశారు.. ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక ల్యాబ్‌లు ఏర్పాటు చేయించారు. గర్భిణులకు ప్రసవం తర్వాత ‘కేసీఆర్ కిట్’ అందిస్తున్నారు. ఇదే ఒరవడిలో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. దీనిలో భాగంగా కొత్తగూడెం- పాల్వంచ మధ్య ఉన్న మైనింగ్ కాలేజీ సమీపంలో మెడికల్ కాలేజీ, రామవరంలో గైనిక్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలు, ప్రిన్సిపాల్ చాంబర్, మెడికల్ ల్యాబ్‌లు, సెంట్రల్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చాయి. 150 సీట్ల భర్తీకి ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 15 నుంచి కాలేజీలో తరగతులు ప్రారంభంకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య సంరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. దీనిలో భాగంగా కొత్తగూడేనికీ ఓ కాలేజీ మంజూరు కాగా మైనింగ్ కాలేజీ సమీపంలో వైద్యారోగ్యశాఖ 30 ఎకరాల సువిశాల స్థలంలో రూ.130 కోట్ల నిధులతో కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 250 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రామవరం సింగరేణి ఏరియాలో 100 పడకల గైనిక్ ఆసుపత్రిని నిర్మించింది. కాలేజీ పరిధిలో అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలు, ప్రిన్సిపాల్ చాంబర్, మెడికల్ ల్యాబ్‌లు, సెంట్రల్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చాయి.
భద్రాద్రి జిల్లా పూర్తి ఏజెన్సీ. ఇక్కడ జీవించే వారిలో మెజార్టీ ప్రజలు గిరిజనులే. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ వైద్యులు.. ఇలా మొత్తం 54 మంది నియమితులయ్యారు. వీరితో పాటు ఓ ఆర్ఎంవో నియమితులయ్యారు. మొత్తం 150 సీట్లు భర్తీకానున్నాయి. వీటిలో 15శాతం సీట్లు కేంద్ర ప్రభుత్వం, 85శాతం సీట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భర్తీ కానున్నాయి. తరగతులు ప్రారంభమై మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే జిల్లాప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. రామవరంలోని గైనిక్ ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యసేవలు అందనున్నాయి. కాలేజీలో ఇటీవల పక్షవాతంతో అనారోగ్యానికి గురైన వ్యక్తికి వైద్యులు చికిత్స అందించి తిరిగి మామూలు మనిషిగా చేశారు. కొత్తగూడెం మెడికల్ కాలేజీలో తొలి అడ్మీషన్‌ను కేరళకు చెందిన శ్రేయా నాయర్ అనే విద్యార్థిని తీసుకున్నది. అడ్మీషన్ కాపీని కలెక్టర్ అనుదీప్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మణరావు, ఆసుపత్రి సూపరిండెంటెండ్ కుమారస్వామి, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా అందజేశారు. ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలో సీట్లన్నీ భర్తీ కానున్నాయి.
ఈ నెల 15 నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే 54 మంది టీచింగ్ స్టాఫ్ నియమితులయ్యారు. క్లాస్‌లు ప్రారంభమైతే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
– డాక్టర్ లక్ష్మణ్‌రావు,మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్