కొణిజర్ల, నవంబర్2 : మండల పరిధిలోని సింగరాయపాలెం, లాలాపురం గ్రామాల్లో జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల అధికారి జీ.అనసూయ మిరప తోటలను బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పూతలో వచ్చే తామర పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. అనంతరం మండలంలో ఆయిల్ పాం తోటలను, బిందు సేద్యం అమరికలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో వైరా డివిజన్ ఉద్యాన అధికారి పీ.అపర్ణ, దుర్గాప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్ 2 : ఈ యాసంగి సీజన్లో మండల వ్యాప్తంగా 16 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసే అవకాశం ఉందని మండల వ్యవసాయాధికారి బాలాజీ తెలిపారు. చిన్నమునగాలలో కనగంటి పుల్లయ్య అనే రైతు మొక్కజొన్న నాటే విధానాన్ని బుధవారం పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రైతాంగం విత్తన కంపెనీల మాయమాటలు నమ్మవద్దని అన్నారు. రైతాంగం నాటు మొక్కజొన్న యేతర వేయదల్చిన రైతులు రెండేళ్ల అనుభవంతో నిర్ణయం తీసుకోవాలన్నారు. పలుకంపెనీలు మండలానికి సంబంధించిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకొని ఆడ, మగ విత్తనాలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఏ కంపెనీ విత్తనాలు వేయదల్చారో ఆ కంపెనీతో రూ.100 బాండ్ పేపర్‌పై నిబంధనలు బాండింగ్ చేయించుకొని సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.
కొణిజర్ల, నవంబర్ 2 : రైతాంగం సాగు చేసే ఆనవాయితీ, వాణిజ్య పంటలకు సంబంధించిన విత్తన కంపెనీలు భారీహోడ్డింగ్లు, బ్యానర్లు, ఆటోలు, జీపులు ఇతర వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించుకునే అనుమతి లేదని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బాలాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆటోలతో ప్రచారం నిర్వహిస్తున్న వాహనాలను నిలిపిన ఏవో విత్తన షాపుల వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, బ్యానర్లు, కటౌట్లను తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి వచ్చి కొందరు మొక్కజొన్న పోస్టర్లు వేస్తుండగా స్వాధీనం వాటిని చేసుకున్నారు.