రాష్ట్రంలోని పూర్తి ఏజెన్సీ జిల్లాల్లో భద్రాద్రి ఒకటి.. జిల్లా గిరిజనులకు ఆలవాలం.. దశాబ్దాల క్రితం పొరుగు రాష్ర్టాల నుంచి వలస వచ్చిన జీవులను అక్కున చేర్చుకున్న నేల.. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగం. ఉమ్మడి పాలకులు గిరిజనులను పట్టించుకోలేదు. వారి కష్టాలను తీర్చలేదు. గిరిజన గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఏజెన్సీవాసుల సమస్యలపై దృష్టి సారించారు. ఒక్కొక్కటిగా వారి సమస్యలను పరిష్కరించారు. దీనిలో భాగంగా దుమ్మగూడెం మండలం రూపురేఖలు మారిపోయాయి. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా వంటి పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పటిష్ఠమయ్యాయి. పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం సరఫరా అవుతున్నది. ఈ ప్రగతి ప్రస్థానంపై ‘నమస్తే’ కథనం.
దుమ్ముగూడెం, అక్టోబర్ 26: భద్రాద్రి జిల్లాలో పూర్తి ఏజెన్సీ ప్రాంతం దుమ్ముగూడెం మండలం. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగం. ఉమ్మడి పాలకులు గిరిజనుల కష్టాలను పట్టించుకోలేదు. మారుమూల గిరిజన గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. స్వరాష్ట్రం వచ్చి గడిచిన ఎనిమిదేళ్లలో ఏజెన్సీ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఒక్కరికైనా అందుతున్నాయి. గడిచిన అర శతాబ్దంలో కనిపించని అభివృద్ధి కేవలం ఎనిమిదేళ్లలోనే కనిపిస్తున్నది.
మిషన్ కాకతీయ ద్వారా మండలంలో 135 చెరువుల్లో పూడికతీత పనులు పూర్తయ్యాయి. నాలుగు దశల్లో జరిగిన ఈ పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసింది. చెరువుల పునరుద్ధరణతో వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతున్నాయి. పైడాకులమడుగులో సీజీ ప్రాజెక్ చెరువులకు రూ.7.50 కోట్లతో మరమ్మతులు చేపట్టగా 9 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
వానకాలంలో మండలవ్యాప్తంగా 34,883 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వీటిలో 18 వేల ఎకరాల్లో వరి, 16 వేల ఎకరాల్లో పత్తి, మిగిలిన భూమిలో మిర్చి, మినుము, పెసర, మొక్కజొన్న, నువ్వులు తదితర పంటలు సాగవుతున్నాయి. 2021-22 సంవత్సరానికి మండలవ్యాప్తంగా 11,951 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదిలో రెండు సార్లు రైతుబంధు జమ అయింది. దీంతో రైతులు దర్జాగా వ్యవసాయం చేస్తున్నారు. రైతుబీమాతో రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. 2018 ఆగస్టు నుంచి ఇప్పటివరకు 243 మంది వివిధ కారణాలతో మృతిచెందగా, ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున రూ.12.15 కోట్ల పరిహారం అందించింది.
మండలంలో 105 గ్రామాలు ఉండగా 95 గ్రామాలకు ‘మిషన్ భగీరథ’ ద్వారా తాగునీరు అందుతున్నది. ఫేజ్-1, ఫేజ్-2లో మండలానికి మొత్తం 290 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు గంగోలు గ్రామంలో 45 మంది, మహాదేవపురం 45 మంది, ప్రగళ్లపల్లి 25 మంది, దుమ్ముగూడెం 25 మంది, చిన్నబండిరేవులో 25 మంది చొప్పన మొత్తం 165 మందికి అధికారులు ఇండ్లను అప్పగించారు. మరో 125 ఇండ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి.
మండలవ్యాప్తం ఉన్న 120 చెరువుల్లో మత్స్యశాఖ అధికారులు వందశాతం రాయితీపై 16,31,400 చేపపిల్లలను వదిలారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 285 మంది ఆడపిల్లల పెండ్లికి రూ.2,85,33,060 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందాయి. దళితబంధు పథకానికి 17 మంది లబ్ధిదారుల ఎంపికయ్యారు. వీరికి రూ.1.70 కోట్ల విలువైన యూనిట్లు అందాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా అధికారులు 2020-21లో మూడు సీసీ రోడ్లు, మూడు డ్రైనేజీలు, 2021-22లో 11 సీసీ రోడ్లు, 2022-2023లో 8 సీసీ రోడ్లు, ఐదు డ్రైనేజీలు నిర్మించారు. ఎస్ఎఫ్సీ నిధుల కింద 2020-21లో రెండు సీసీ రోడ్లు, 2021-22లో రెండు సీసీ రోడ్లు నిర్మించారు. రోడ్ల నిర్మాణానికి రూ.90 లక్షలు వెచ్చించారు.
40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఏజెన్సీ మండలం తెలంగాణ వచ్చాక కేవలం ఎనిమిదేళ్లలోనే గణనీయమైన ప్రగతి సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెన్సీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైంది. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయింది. ప్రజలకు మౌలిక వసతులు అందుతున్నాయి.
– తెల్లం సీతమ్మ, జడ్పీటీసీ, దుమ్ముగూడెం
ఉమ్మడి పాలనలో ఏజెన్సీ నిర్లక్ష్యానికి గురైంది. సీఎం కేసీఆర్ మాత్రమే ఏజెన్సీ బాగోగులను పట్టించుకుంటున్నారు. ఆయన పాలనాదక్షతతోనే ఏజెన్సీ రూపురేఖలు మారిపోయాయి. అర్హులైన ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ప్రజలందరూ కేసీఆర్ పాలను హర్షిస్తున్నారు.
– రేసు లక్ష్మి, ఎంపీపీ, దుమ్ముగూడెం
నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బందిపడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు. మా అమ్మాయి పెళ్లికీ మాకు రూ. రూ.1,00,116 చెక్కు అందింది. ఆ డబ్బుతో అమ్మాయి పెండ్లి చేశాం. గౌరవప్రదంగా అత్తవారింటికి పంపించాం.
ఏజెన్సీ మండలమైన దుమ్ముగూడెం మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన గూడేల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మండలాభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– చంద్రమౌళి, ఎంపీడీవో, దుమ్ముగూడెం
ఉమ్మడి పాలనకు దివ్యాంగులకు కేవలం రూ.500 పింఛను అందేది. పింఛను సరిపోయేది కాదు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు నెలనెలా రూ.3,016 పింఛను పెంచారు. మాలో ఆత్మైస్థెర్యాన్ని నింపారు. ఎవరి మీదా ఆధారపడకుండా ప్రతి నెలా అందే పింఛన్‌తో అవసరాలను తీర్చుకుంటున్నాం. కేసీఆరే మాకు దైవం.
– కుంజా లక్ష్మీవర్థన్, దివ్యాంగుడు, నర్సాపురం
మండలవ్యాప్తంగా 37 పంచాయతీల పరిధిలో మొత్తం 5,900 మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నెల నెలా ఆసరా పింఛను అందుతున్నది. వీరి ఖాతాల్లో నెలకు రూ.1.26 కోట్ల పింఛను జమ అవుతుంది. దివ్యాంగులకు నెలకు రూ.3,016 చొప్పున జమ అవుతుండగా మిగిలిన వారి ఖాతాల్లో రూ.2,016 చొప్పున జమ అవుతున్నది.
ఉమ్మడి పాలనలో వృద్ధులకు పింఛను రూ.వందల్లోనే ఉండేది. సీఎం కేసీఆర్ దానిని రూ.2,016 చేశారు. దివ్యాంగులకు రూ.3,016 చొప్పున అందిస్తున్నారు. నెల నెలా మాకు ఠంచనుగా పింఛను అందుతున్నది. ఆ డబ్బుతోనే నేను మందులు కొంటున్నాను. కేసీఆర్ ఇంటికి పెద్దకొడుకుగా నిలిచి వృద్ధులు, దివ్యాంగులను ఆదుకుంటున్నారు.
– కనుకు నాగయ్య, వృద్ధుడు, నర్సాపురం