దమ్మపేట, ఫిబ్రవరి 8: దమ్మపేట మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల సంఖ్య వెయ్యి దాటింది. తాజా గణాంకాలు పరిశీలిస్తే 1,097 మంది పేదల ఈ పథకం లబ్ధిపొందారు. గడిచిన ఏడేళ్లలో వీరు ఆ పథకాల కింద రూ.9 కోట్ల లబ్ధిని పొందారు. దమ్మపేట మండలంలో లబ్ధిదారుల సంఖ్య వెయ్యి దాటడం, రాష్ట్రంలోనూ 10 లక్షల మందికిపైగా ఈ పథకాల వల్ల లబ్ధి పొంది ఉండడం నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని, ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వారి అండగా ఉంటోందని అన్నారు. తొలుత రూ.51 వేల సాయంతో మొదలైన ఈ పథకం నేడు రూ.1,00,116కు చేరిందని అన్నారు. ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక చేయూతను అందిస్తూ సీఎం కేసీఆర్ వారికి మేనమామలా అండగా ఉంటున్నారని అన్నారు. మండలవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటివరకు 1,097 మంది లబ్ధిదారులకు సుమారు రూ.9 కోట్ల మేర వివాహ ఖర్చులు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ప్రజలంతా పథకాన్ని మెచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను గమనించాక సీఎం కేసీఆర్ మదిలో మెదిలిన బృహత్తర పథకాలే కల్యాణలక్ష్మి, షాదీముబారక్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్ ఈ పథకాలను అమల్లోకి తెచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా నిరుపేదలు లబ్ధిపొందారు. వారికి వేల కోట్ల రూపాయల మేరకు నిరుపేదలకు సాయం అందింది. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను చేపట్టి అమలుచేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. కేసీఆర్ దీవెన రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకూ ఎల్లప్పుడూ ఉంటుంది.
-మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, అశ్వారావుపేట
నా కుమార్తెకు నిరుడు వివాహం చేశాను. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం నా పేరుతో రూ.1,00,116 చెక్కు మంజూరు చేసింది. తహసీల్దార్ కార్యాలయంలో ఈ చెక్కును అందుకున్న సమయంలో ఎంతో సంతోషం అనిపించింది. అంతమొత్తంలో ఆర్థిక సాయం అందే సరికి వివాహ సమయంలో చేసిన అప్పులను తీర్చేయొచ్చనే ధైర్యం వచ్చింది. గుండెలపై భారం తగ్గినట్లు అనిపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది.
– శీలం రజిని, వడ్లగూడెం
నా కుమార్తె వివాహానికి ఆసరాగా నిలిచిన కల్యాణలక్ష్మి పథకం మా కుటుంబంలో సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలిచారు. నా కుమార్తెకు పాప పుడితే కవితమ్మ అని, బాబు పుడితే కేసీఆర్ అని పేర్లు పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. కల్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడుతున్నది.
– సిద్ధ మారతమ్మ, వడ్లగూడెం