ఖమ్మం, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపరచడం, రైతులకు నాణ్యమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది. విస్తరణ అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు వారి పనితీరును వారానికి ఒకసారి పరిశీలన చేసి మార్కులను ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. రెండు, మూడు విడతలుగా పనితీరును పరిశీలించిన రాష్ట్రస్థాయి అధికారులు మార్కులను కేటాయించారు. నాలుగు రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని పనితీరును పరిశీలిస్తున్నారు. నాలుగు అంశాలకు 100 మార్కులు కేటాయించారు. పంటల నమోదు ప్రక్రియకు 40, రైతుబీమా పథకం అమలుకు 20, పీఎం కిసాన్ పథకం అమలుకు 30, క్వాలిటీ కంట్రోల్‌కు 10 చొప్పన కేటాయిస్తున్నారు. అధికారుల ప్రతిభ, రైతులకు అందించిన సేవలకు అనుగుణంగా మార్కులు ఇస్తారు. ప్రస్తుతం మార్కుల కేటాయింపు ప్రక్రియ విస్తరణ అధికారుల మినహా మిగిలిన అధికారుల అందరికీ ఇస్తున్నారు. త్వరలో ఏఈవోల పనితీరును ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ నాలుగు అంశాలకు సంబంధించి మండల, డివిజన్, జిల్లా అధికారులకు ప్రణాళిక ఇచ్చారు. నెల రోజుల నుంచి డివిజన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
క్రాప్ బుకింగ్ ప్రక్రియను ఇప్పటికే ఏఈవోలు చేస్తున్నారు. భూముల్లో ఏ రకం పంట సాగైంది, సర్వే నంబర్, రైతు పేరు, తదితర వివరాలను ఏఈవోలు ప్రత్యేక పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. ఏడీఏలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మరోమారు పరిశీలించాలి. ఇందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్‌బుకింగ్ యనాన్స్మెంట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి వారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు నిర్దేశించిన గ్రామంలో 20 సర్వేనంబర్ల భూములను పరిశీలించాలి. మండల, డివిజన్ వ్యవసాయశాఖ అధికారులు వారంలో రెండు గ్రామాల్లో 40 సర్వే నంబర్లలోని భూములను పరిశీలించాలి. గ్రామాలు, సర్వే నెంబర్లు ఏమిటీ అనేది అంతకు ముందుగానే రాష్ట్ర స్థాయి అధికారులు యాప్‌లో పొందుపరుస్తారు. దీంతో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లిన అధికారులు.. పంట, రైతు పేరు, విస్తీర్ణం తదితర వివరాలతోపాటు ఫొటో సైతం తీసి యాప్‌లో అక్కడికక్కడే అప్లోడ్ చేయాలి. నిర్దేశించిన రెండు ప్రదేశాల్లో సెల్ఫీ ఫొటోలు అప్లోడ్ చేయాలి. తాజాగా విడుదల చేసిన మార్కుల ప్రకారం ఖమ్మం జిల్లా 24.3 మార్కులతో 15వ స్థానం, భద్రాద్రి జిల్లా 31.0 మార్కులతో 7వ స్థానంలో నిలిచింది.
రైతుబీమా పథకం అమలుకూ మార్కులు కేటాయిస్తున్నారు. చనిపోయిన రైతుల వివరాలు మూడు రోజుల్లో ఆన్లైన్లో ఏఈవోలు పొందుపరిస్తే అందుకు అనుగుణంగా మార్కులు కేటాయిస్తున్నారు. అనంతరం రోజువారీగా ఆలస్యాన్ని బట్టి మార్కులు ఇస్తున్నారు. సకాలంలో రైతు వివరాలు పొందుపరిచిన మండల అధికారులకు మెరుగైన ర్యాంకులు ఇస్తున్నారు. ఖమ్మం 5.4 మార్కులతో 13వ స్థానం, భద్రాద్రి జిల్లా 10.6 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ పథకం అమలు చేసే అధికారులకూ మార్కులు ఇస్తున్నారు. ఈ పథకానికి 30 మార్కులు కేటాయించారు. భద్రాద్రి జిల్లా 21.6 మార్కులతో 19వ స్థానం, ఖమ్మం జిల్లా 17.3 మార్కులతో 29వ స్థానంలో నిలిచింది. వ్యవసాయశాఖ అధికారుల పనితీరుకు మార్కులు కేటాయించే అంశాల్లో క్వాలిటీ కంట్రోల్ విధానాన్ని పరిగణంలోకి తీసుకున్నారు. ఏటా సీజన్ ఆరంభంలో ఆయా మండలాల, డివిజన్ల వ్యవసాయశాఖ అధికారులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాలను సందర్శించాలి. ఆ సమయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్దేశించిన ప్రకారం శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించాలి. ఖమ్మం జిల్లాకు 10మార్కులకు 9.8 మార్కులు, భద్రాద్రి జిల్లాకు 9.8 మార్కులు ఇచ్చారు.
వ్యవసాయశాఖ అధికారుల పనితీరుకు మార్కులు కేటాయించడం ద్వారా పనిలో పోటీ పెరిగే అవకాశం ఉంది. నాలుగైదు వారాల నుంచి ఈ విధానం అమలవుతున్నది. రైతులు, అధికారుల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతున్నది. నేటి వరకు విడుదల చేసిన మార్కుల్లో ఖమ్మం జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. ఏడీఏ, డీఏవో ఫీల్డ్ విజిట్‌లో రాష్టంలోనే ఖమ్మం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
– ఎం. విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి