ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ‘హస్త’వ్యస్తమవుతున్నది.. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ తన మనుగడను సమాప్తం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది.. ‘నాలుగు వర్గాలు.. ఎనిమిది నిరసనలు’ అన్న నినాదంతో కేడర్ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతున్నది.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ప్రతి చోటా బడా నేత ‘ఎమ్మెల్యే టికెట్ నాదంటే నాది..’ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.. పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసినా తమకు గుర్తింపు లేదని ఒక వర్గం వాపోతుంటే.. మరోవర్గం కొత్తగా పార్టీలో చేరిన వారికి అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని పెదవి విరుస్తున్నారు.. ఇదే కోవలో సోమవారం కొత్తగూడెం కేంద్రంగా రెండు వర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. ఎడవల్లి కృష్ణకు సంబంధించిన ఓ అనుచరుడు సెల్‌టవర్ ఎక్కి ‘ఎడవల్లి’కి పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మరోవైపు పోట్ల నాగేశ్వరరావుకు సీటు ఇవ్వాలని తన వర్గీయులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఏం చేయాలో తెలియక కార్యకర్తలు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు.. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మునిగే పడవేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఖమ్మం, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. శాసనసభ టికెట్ల పంచాయితీ ప్రకంపనలు సృష్టిస్తోంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని జెండా మోసిన సీనియర్ నేతలకు టికెట్ల కేటాయింపులో మొండిచేయి చూపడంతో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ముందు వచ్చిన చెవుల కన్నా.. వెనుక వచ్చిన కొమ్ములకే ప్రాధాన్యం’ అనే రీతిలో కాంగ్రెస్ తీరు ఉందని మండిపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ఐదేళ్లుగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి.. ద్వితీయ శ్రేణి, పార్టీ నాయకులను కాపాడుకున్న తమను నిర్లక్ష్యం చేయడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ వర్గానికి చెందిన రాజేంద్రప్రసాద్ సోమవారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు జోక్యం చేసుకొని కిందకు దించారు. అలాగే మరో నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు కొత్తగూడెం సీటు కేటాయించాలని పోస్టాఫీస్ సెంటర్లో కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు గాను రెండు ఎస్సీ, ఐదు ఎస్టీ, మూడు జనరల్ చొప్పున రిజర్వ్ అయి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు పార్టీకి చెందిన ఆశావహులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో సర్వేలు, వడపోతల పేరుతో అనేక మందికి అవకాశాలు రాకుండా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు, పైరవీలు జరుగుతుండడంతో ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేసిన నేతలు ఇదేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ సారి అవకాశం ఇవ్వకపోతే తాడోపేడో తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకుంటామని కొంతమంది నేతలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సిట్టింగ్ స్థానాలైన భద్రాచలం, మధిర నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన నేతలు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాయల నాగేశ్వరరావు ఆదివారం రాత్రి ఖమ్మంలో పోట్ల నాగేశ్వరరావు ఇంట్లో తక్షణ కర్తవ్యం, భవిష్యత్ ప్రణాళికపై సమావేశమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల తరబడి సేవలందించినా, కష్టకాలంలో అండగా ఉండి కార్యకర్తలను కాపాడుకున్నా.. పార్టీ గుర్తించే పరిస్థితి లేకపోవడంపై సమావేశంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించి.. శాపనార్థాలు పెట్టిన నేతలకు పెద్దపీట వేయడాన్ని పార్టీ ద్విత్రీయ శ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలని అసంతృప్తి నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సీటును ఆశించిన కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్.. శాసనసభా పక్ష నేత భట్టివిక్రమార్కకు అత్యంత సన్నిహితుడిగా పార్టీలో గుర్తింపు పొందారు. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు ప్రతి కార్యక్రమాన్ని భుజాన వేసుకుని విజయవంతం చేస్తే తనకు దక్కింది ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఖరారు చేసిందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన పోట్ల నాగేశ్వరరావు సైతం తనకు టికెట్ ఇచ్చే అంశంపై పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత, భరోసా రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురయ్యారు. ఇతర పార్టీల ముఖ్య నేతలు చేరకముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోట్ల నాగేశ్వరరావు మూడేళ్లుగా కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి సారించి పార్టీ కార్యకలాపాలను కొనసాగించారు. అక్కడ క్యాంపు కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. అలాగే పార్టీలో మరో బీసీ నేతగా, జిల్లా నాయకుడిగా గుర్తింపు పొందిన ఎడవల్లి కృష్ణ సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగూడెం అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలకు పొత్తు కుదురుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకు కేటాయిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇటు పోట్ల నాగేశ్వరరావు, అటు ఎడవల్లి కృష్ణ వర్గీయులు తమ నేతల రాజకీయ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘కొత్తగూడెం’ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయి. గ్రూప్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ‘ఎవరికి వారే యమునా తీరే..’ అన్నట్లుగా ‘హస్తం’ బలగం పయనం కొనసాగుతున్నది. ‘గూడెం’లో ఆ పార్టీ ప్రధానంగా నాలుగు వర్గాలుగా విడిపోయింది. ఒకవర్గం ఎడవల్లి కృష్ణ వర్గం, రెండోవర్గం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వర్గం, మూడోవర్గం నాగ సీతారాములు వర్గం కాగా నాలుగో వర్గం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం. ఈ నాలుగు వర్గాల మధ్య నిత్యం ఏదో ఒక విధంగా అంతర్గత కలహాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే సోమవారం ఎడవల్లి కృష్ణ వర్గానికి చెందిన వ్యక్తి రాజేంద్రప్రసాద్ కొత్తగూడెంలోని ఓ సెల్‌టవర్ ఎక్కి ‘ఎడవల్లి’కి పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారుడికి నచ్చజెప్పి కిందికి వచ్చేలా చేశారు. మరోవైపు మరో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలని పోస్టాఫీస్ సంటర్‌లో ఆయన వర్గీలయులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. చివరకు ‘ఏ నావది ఏ తీరమో..’ వేచి చూడాల్సిందే..!
ఖమ్మంలో పోట్ల నాగేశ్వరరావు ఇంట్లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కాంగ్రెస్ తమకు మొండిచేయి చూపితే బీఆర్ఎస్ పార్టీ వైపు దృష్టి సారిస్తే ఎలా ఉంటుందన్న అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. సదరు నాయకులకు బీఆర్ఎస్లో ఉన్న కొందరు నేతలతో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయా నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరే అంశంపై పలు కోణాల్లో చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఇద్దరినే. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్యల అభ్యర్థిత్వాలను మాత్రమే ఖరారు చేసింది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేయకపోయినా.. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలతోపాటు వారి వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై పార్టీ కార్యకర్తలతోనూ సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.