పాల్వంచ రూరల్, జూలై 29 : మండలంలోని గుత్తికోయలు నివసించే ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి డ్రైడే నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ‘ఫ్రై డే- డ్రై డే’ సందర్భంగా పాల్వంచ మండలంలోని రాజాపురం, కిన్నెరసాని, ఉల్వనూరు ప్రాంతాల్లో పర్యటించారు. ఉల్వనూరులో డ్రైనేజీ లేకపోవడం, ఇండ్ల మధ్యలో మురికినీరు నిల్వ ఉండడాన్ని పరిశీలించారు. పలు గృహాల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.
వర్షపు నీరు ఇండ్లలోకి వస్తుందని స్థానికులు కలెక్టర్‌కు తమ సమస్యను విన్నవించుకోవడంతో త్వరలోనే డ్రైనేజీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నివాస పరిసరాల్లో నిల్వ ఉన్న మురికి నీటిని పరిశీలించి వెంటనే దోమల మందు స్పే చేయాలని డీఎంహెచ్‌వో దయానందస్వామిని ఆదేశించారు. ఉల్వనూరు పీహెచ్‌సీని కలెక్టర్ సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించి మలేరియా కేసులు ఉల్వనూరు, పాండురంగాపురంలో ఎక్కువగా నమోదు అవుతున్నందున ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గుత్తికోయలు నివసించే ప్రాంతాల్లో వారికి ఓడోమాస్, మస్కిటో కాయిల్స్ అందజేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రతిఒక్కరూ వ్యక్తిగత శ్రద్ధ పాటించేలా మైకు ద్వారా పంచాయతీలో ప్రచారం నిర్వహించాలని ఎంపీవో నారాయణను ఆదేశించారు. వర్షాలు తగ్గినందున పారిశుధ్యం విషయంలో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
బాలికల హాస్టల్‌ను సందర్శించి మెనూను పరిశీలించారు. బాలికల వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలని ప్రిన్సిపాల్ పద్మను ఆదేశించారు. కిన్నెరసాని డ్యామ్ వద్ద అధికారులతో మాట్లాడి వరద వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో దయానందస్వామి, డాక్టర్ ప్రతాప్, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీడీవో రవీంద్రప్రసాద్, ఎంపీవో నారాయణ, సర్పంచ్ వాసం రుద్ర పాల్గొన్నారు.
పాల్వంచ/ పాల్వంచ రూరల్, జూలై 29 : వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నదని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ అన్నారు. పాత పాల్వంచలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించి డ్రైడే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ఖాళీ స్థలాలు, గుంటల్లో నిల్చిన నీటిలో మలాథియాన్, ఆయిల్ బాల్స్ వేశారు. పంక్చర్ షాపుల్లో టైర్లల్లో ఉన్న నీటిని పారబోయించారు. ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పాల్వంచ మండలంలోని నాగారం, తోగ్గూడెం, లక్ష్మీదేవిపల్లి, పునుకుల, యానంబైలు, రాజాపురం, మందెరికలపాడు, బంజర తదితర ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమాలు నిర్వహించారు.