భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో శుక్రవారం వర్షం దంచికొట్టింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, కుంటల్లో వరద పొంగి పొర్లింది. వాన కారణంగా కొన్నిచోట్ల వినాయక నిమజ్జనోత్సవాలకు ఆటంకం కలిగింది. పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, కేశాపురం, జగన్నాథపురం, నాగారం, దంతెలబోర సంగం, కిన్నెరసానిలోని చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టుతో పాటు పూసుగూడెంలోని ఈదులవాగు, తెల్లవాగు చెరువులు, కమలాపురంలోని పెద్దయ్యచెరువు, సూరంపాలెంలోని లింగసముద్రం చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరింది.
అత్యధికంగా పాల్వంచ మండలంలో 215 మి.మీ వర్షం కురిసింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో 119 మి.మీ, కొత్తగూడెం 42 మి.మీ, దమ్మపేట 29 మి.మీ, ములకలపల్లి 26 మి.మీ, మణుగూరు 14 మి.మీ, సుజాతనగర్ 11 మి.మీ, భద్రాచలం 13 మి.మీ, అన్పపురెడ్డిపల్లి 11 మి.మీ, ఇల్లెందు 8 మి.మీ, బూర్గంపాడులో 10 మి.మీ వర్షం కురిసింది. టేకులపల్లి మండలంలోని పెట్రాం చెలక స్టేజీకి చెందిన ఇస్లావత్ వసంతరావు అనే వ్యక్తి పిడుగుపాటుతో మృతిచెందాడు. అశ్వారావుపేటలోని సంతమార్కెట్, గౌడబజార్, కోనేరు వీధి, నందమూరి నగర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. మరోవైపు పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము సాగు చేస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. వర్షం పంటలకు ప్రాణం పోసిందని రైతులు వెల్లడిస్తున్నారు.
పాల్వంచ పట్టణంలో..
పాల్వంచ, సెప్టెంబర్ 9: పాల్వంచ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వడ్డుగూడెం, టీచర్స్‌కాలనీ, వనమా కాలనీ, జయమ్మకాలనీ, శివనగర్, హిల్స్‌కాలనీ, వెంగళరావుకాలనీలు ముంపునకు గురయ్యాయి. పాల్వంచ- కొత్తగూడెం జాతీయ రహదారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి గుడి వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై నరేశ్, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వరద నీటిని మళ్లింపజేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వడ్డుగూడెం సబ్‌స్టేషన్ ఏరియా, టీచర్స్‌కాలనీ, కోయిల వాటర్‌ప్లాంట్ ఏరియాలో నడుములోతు వరద నీరు నిలిచింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.