ఖమ్మం సిటీ, జూన్ 26: యువత.. యాంటీ డ్రగ్స్ వారియర్లుగా నిలవాలని ఖమ్మం సీపీ సునీల్‌దత్ ఆకాంక్షించారు. ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా జిల్లా పోలీస్, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో బుధవారం అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం నుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించిన ర్యాలీని సీపీ సునీల్‌దత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ మార్పులోనూ, నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మత్తు అనే మహమ్మారికి యువత బానిసలుగా మారవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగమే సమాజంలో అన్నిటికంటే భయంకరమైన వ్యాధి అని అభివర్ణించారు. చాపకింద నీరులా అది వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అప్రమత్తం కావాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో చేరి సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 8712671111కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రేతల పేర్లు వెల్లడించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. గడిచిన ఆరేళ్లలో 204 కేసుల్లో 265 మందిని అరెస్ట్ చేసి రూ.11 కోట్ల విలువైన 9,008 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గంజాయి మత్తుకు అలవాటుపడిన 165 మందికి సైకాలజిస్టుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. అనంతరం ‘మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు – మాదకద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని ఆవిష్కరించేందుకు మావంతు సహకారం అందిస్తాం’ అంటూ విద్యార్థులు, యువతీ యువకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.
వైరా, కల్లూరు, ఖమ్మం రూరల్ పోలీసు సబ్ డివిజన్లలోనూ ఆ శాఖ అధికారులు యువతతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అయితే, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వారం రోజులపాటు విద్యాసంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు. ఈ ర్యాలీల్లో డీడబ్ల్యూవో రాంగోపాల్‌రెడ్డి, ఏడీసీపీలు ప్రసాద్‌రావు, నరేశ్‌కుమార్, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాసులు, సీఐలు భానుప్రకాశ్, శ్రీహరి, రమేశ్ పాల్గొన్నారు.