కారేపల్లి, ఫిబ్రవరి 18 : రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ లాభదాయక పంటలు పండించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. చీమలపాడు, రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో రైతులు సాగు చేస్తున్న పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర పంటలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. అక్కడే చెట్టు కింద రైతులతో సమావేశమై సాగు విధానంలో కష్టనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. కోతుల వల్ల పండించిన పంట చేతికందక నష్టపోతున్నామని రైతులు తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన కలెక్టర్ సోలార్ పవర్ ద్వారా పంట చుట్టూ విద్యుత్ కంచెలను సబ్సిడీ ద్వారా ఇప్పించేందుకు కృషి చేస్తానని, ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత శాఖ సిబ్బందిని ఆదేశించారు. అలాగే పంటల సాగుకు సబ్సిడీ ఇవ్వాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. ఉపాధిహామీ పథకం ద్వారా నీటి గుంటలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ముందుకొస్తే వారి పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ఉపయోగించి నీటి గుంటలు ఏర్పాటు చేయిస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీవో సురేందర్, విద్యుత్ శాఖ ఏడీ ఆనంద్, ఉద్యానవన శాఖ అధికారి వేణు, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, ఆర్ఐ జార్జి, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ఉన్నారు.