మామిళ్లగూడెం, ఏప్రిల్ 2:మండల, గ్రామ జనాభాకు అనుగుణంగా, ప్రభుత్వ లక్ష్యాల మేరకు రాజీవ్ యువ వికాసం యూనిట్లను మంజూరు చేయనున్నట్లు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అర్హులైన నిరుద్యోగులు ఈ నెల 14లోపు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
యువ వికాసం, సన్నబియ్యం పంపిణీపై కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనూ, అనంతరం యువ వికాసం అమలుపై మండల స్థాయి అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షలోనూ ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వివిధ యూనిట్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఎంచుకున్న సెక్టార్లు, వ్యాపారాల వారీగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామన్నారు.
బ్యాంకు లింకేజీ రుణాలు కూడా తప్పనిసరిగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే, తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు చౌకదుకాణాల్లో ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. సన్న బియ్యం పక్కదారి పట్టడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు నాణ్యత లేని సన్న బియ్యం అందిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సన్యాసయ్య, నవీన్‌బాబు, జ్యోతి, విజయలక్ష్మి, పురందర్, శ్రీలత, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.