మామిళ్లగూడెం, ఫిబ్రవరి 15: శాఖాపరమైన లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిపై జిల్లాలోని ఎంపీడీవోలతో నూతన కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత నూతనంగా బదిలీపై జిల్లాకు వచ్చిన ఎంపీడీవోలను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బదిలీలు, ఉద్యోగోన్నతులు అనేవి ప్రతి ఉద్యోగికీ కొత్త జన్మ లాంటివని అన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్లినా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఇప్పుడు సర్పంచ్ల పదవీకాల ం ముగిసినందున.. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉందని, ఈ క్రమంలో ఎంపీడీవోలపై ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు.
గ్రామాల్లో ప్రత్యేక అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. ఇది ఎన్నికల సమయమైనందున నిష్పక్షపాతంగా పని చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో లేబర్ టర్నోవర్ పెంచాలని సూచించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రాజెక్ట్ రాస్తాలో భాగంగా గ్రామాల్లోని డొంకల ఆక్రమణలు తొలగించి రహదారి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో వినోద్, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో హరికిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు చందన్‌కుమార్, శ్రీనివాసులు, చంద్రమౌళి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.