‘సీఎం కేసీఆర్ విజన్ మేరకు గొంగళి పురుగులాంటి ఖమ్మం నగరాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దాం.. అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం.. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం.. నగరవాసులకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.. ఇప్పటికే తాగునీటి సమస్యను అధిగమించాం.. పారిశుధ్య నిర్వహణను పక్కాగా చేపడుతున్నాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ‘వాడ వాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నగరంలో సైకిల్‌పై పర్యటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నగరంలో పలు అభివృద్ధి పనులు, సర్దార్ పటేల్ స్టేడియంలో ‘సీఎం కప్’ పోటీలను ప్రారంభించారు. – ఖమ్మం, మే 15
ఖమ్మం, మే 15: గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని తొమ్మిదేళ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం పనిచేయడం వల్లనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుకోగలిగామని అన్నారు. ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకే కేఎంసీ కార్యాలయం నుంచి సైకిల్‌పై బయలుదేరిన మంత్రి అజయ్‌కుమార్.. కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువై నగరంలోని సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే తాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు. ఇప్పుడు చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతోందని, గతంతో పోల్చితే ప్రస్తుతం రోడ్ల మీద చెత్త లేకుండా పోయిందని, మున్సిపల్ వాహనాల ద్వారా నిర్విరామంగా చెత్తను సేకరిస్తున్నామని అన్నారు. ఇక మురుగును సైతం పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతోనే కేవలం డ్రెయిన్ల నిర్మాణానికే డివిజన్‌కు రూ.40 లక్షల చొప్పున కేటాయించామని అన్నారు. ప్రస్తుతం నిర్మించిన గోళ్లపాడు చానల్ అండర్ గ్రౌండ్ 11 కిలోమీటర్లను ఎలా చేశామో.. త్వరలో 23 కిలోమీటర్ల మేర కూడా అదే విధంగా అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపడుతామని అన్నారు. ఈ పనులకు మంత్రి కేటీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని అన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి వివరించారు.
ఉదయం ఆరింటికే సైకిల్‌పై బయలుదేరి..
‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఉదయం ఆరు గంటలకే సైకిల్‌పై బయలుదేరిన మంత్రి అజయ్.. నగర వీధుల్లో పర్యటిస్తూ పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్డు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, హ్యాండ్ బోర్లను పరిశీలించి వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు. మురుగు కాల్వల్లో పేరుకపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు. నూతన బస్టాండ్‌కు చేరుకొని టాయిలెట్లలో శుభ్రతను పరిశీలించారు. బస్టాండ్‌లోని దుకాణదారులతో మాట్లాడి వస్తువుల ధరల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రయాణికులను కలిసి సేవలు, సౌకర్యంపై ఆరా తీశారు. పెద్ద మారెట్లోకి వెళ్లి అకడి రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. అధిక మొత్తంలో ఉండే కూరగాయల వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది ఆలస్యంగా తొలగిస్తున్నారని వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే వ్యర్థాలను పరిశీలించిన మంత్రి అజయ్.. వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. పక్కనే ఉన్న పీవీ నర్సింహారావు పారును సందర్శించిన మంత్రి అజయ్.. అక్కడి గ్రీనరీ, ఓపెన్ జిమ్‌లను పరిశీలించారు. పారులో కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులతో ముచ్చటించారు.
అక్కడి నుంచి మయూరిసెంటర్ మీదుగా ఆర్వోబీ దిగిన మంత్రి పువ్వాడ.. జూబ్లీపుర ప్రాంతాల్లో పర్యటించారు. మయూరిసెంటర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. వాటి వివరాల గురించి ఆర్అండ్బీ ఈఈ శ్యామ్‌ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి ట్రంక్ రోడ్డు, కాల్వొడ్డు, మోతీనగర్‌కు వెళ్లి అక్కడి మురుగు కాల్వలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మురుగును తొలగించాలని సిబ్బందికి సూచించారు. బురద రాఘవాపురంలో మిషన్ భగీరథ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి ప్రధాన పైపులైన్‌ను ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైడ్ కాల్వలు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని, రోడ్డు శిథిలావస్థలో ఉందని వారు వివరించారు. తక్షణమే వాటిని నిర్మిస్తామని అన్నారు.
ఆ తరువాత భక్తపోతన స్ట్రీట్, డాబాల బజార్, గుట్టల బజార్లో పర్యటించారు. మిషన్ భగీరథ ద్వారా పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో నిర్మించిన 2300 కేఎల్ సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంను పరిశీలించారు. గుట్టలబజార్, జహీర్‌పుర, రాజేంద్రనగర్, శ్రీనివాస్‌నగర్ బ్రిడ్జి మీదుగా చర్చికాంపౌండ్, బోనకల్లు క్రాస్‌రోడ్డు, చెరువుబజార్, మాణిక్య నగర్, అబ్దుల్ కలాం నగర్ మీదగా మమత రోడ్డు వరకూ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, మురుగు కాలువల పనుల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, రాపర్తి శరత్, పసుమర్తి రామ్మోహన్రావు, ఎల్లంపల్లి వెంకట్రావు, కన్నం ప్రసన్నకృష్ణ, ఆళ్ల అంజిరెడ్డి, జశ్వంత్, బలుసు మురళీకృష్ణ, పాలడుగు పాపారావు, ధనాల శ్రీకాంత్, దోన్వాన్ రవి, తాజుద్దీన్, షకీనా, అధకారులు రంజిత్, కృష్ణాలాల్, శైలజ, రమేశ్ పాల్గొన్నారు.