చదువుతూనే మైండ్‌ను ఫ్రీ చేసుకోవాలి
సాధన చేస్తే కొలువు అసాధ్యమేమీ కాదు
భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచనలు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు, యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సర్కార్ ఉద్యోగం సాధించాలని పట్ట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఎన్నోఏళ్ల కల సాకారం చేసుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చుకుంటున్నారు. ఈ క్రమంలో పోటీపరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి.. ఏ సిలబస్ చదవాలి.. రోజుకు ఎన్ని గంటలు కష్టపడాలి.. ఇలా అనేక సందేహాలతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో యువ కలెక్టర్, చిన్న వయసులో సివిల్స్ సాధించిన దురిశెట్టి అనుదీప్ తన అనుభవాలు నమస్తేతో పంచుకున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ప్రణాళికతో చదవాలని సూచించారు. సర్కారు కొలువు సాధించడా నికి ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదని, ఎంత బాగా చదివా మా అన్నదే ప్రధానమని పేర్కొన్నారు.
ప్రణాళికతో చదవాలని, ప్రధానంగా మాక్ టెస్టులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. సాధన చేస్తే కొలువు అసాధ్యమేమీ కాదని, చదువుతూనే మైండ్‌ను ఫ్రీ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్న నేపథ్యంలో పోటీ, ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారాయన. యువ కలెక్టర్ ఆయన చిన్న వయసులోనే సివిల్స్ టాప్ ర్యాంక్ సాధించారు. పట్టుదలతో లక్ష్యాన్ని ఛేదించి భద్రాద్రి జిల్లాకు తొలి కలెక్టర్ అయ్యారు. సాధన చేస్తే సాధించలేని ఏదీ లేదని అనుభవపూర్వకంగా చెబుతున్నారాయన. కలెక్టర్ దురిశెట్టిని ఆదర్శంగా తీసుకుంటే మన జిల్లాలోనూ అలాంటి వారు చాలామంది ఉద్భవించే అవకాశాలు లేకపోలేదు.
సర్కారు కొలువు కొట్టాలంటే ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదని, ఎంత బాగా చదివామన్నదే ముఖ్యమని చెబుతారాయన. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుల కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్నందున ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని సూచిస్తున్నారు. తాజాగా ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఎలాంటి మెళకువలు పాటించాలనే విషయంపై ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. అభ్యర్థులకు ఉపయుక్తమయ్యే మరిన్ని సూచనలు, సలహాలు అందించారు.
అవన్నీ ఆయన మాటల్లోనే..
పక్కాగా జాబ్ రావాలని ప్రతి ఒక్కరూ చదువుతారు. కానీ అందరికీ రాకపోవచ్చు. మనం దేనిమీదనైతే దృష్టి పెడుతున్నామో దానిపై మనకు నమ్మకం ఉండాలి. ఎన్ని గంటలు చదువు తున్నామనేది పక్కన పెడితే.. ఎంత సమయం బాగా చదివామనేది ముఖ్యం. గంటల కొద్దీ చదివినంత మాత్రాన అన్నీ గుర్తుండవు. అర్థమయ్యేలా చదవాలి. అర్థం చేసుకోవాలి. ప్రతి రోజూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. మనం చదువుకునే టేబుల్ ముందే టైం టేబుల్‌ను పేపర్‌పై రాసి పెట్టుకోవాలి. ఏ సమయంలో ఏం చదవాలనే విషయంపై మనం ఎంత పట్టు సాధిస్తున్నామనేది కూడా ముఖ్యమే.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమయం కేటాయించుకోవాలి. ముందుగా మనం రాసే పరీక్ష సిలబస్‌ను ఎంపిక చేసుకోవాలి. కోచింగ్‌లు ముఖ్యం అయినప్పటికీ వాటికి కొంత సమయం కేటాయించి మిగతా సమయాన్ని మన ఇంటి దగ్గర కేటాయించుకోవాలి. సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టులను కేటాయించుకోవాలి. కరంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. కొత్త బుక్స్ వస్తున్నాయంటే వెంటనే వాటిని రీడ్ చేయాలి.
గోల్ పెట్టుకున్నామంటే దానిని సాధించి తీరాలి. అప్పుడే మనకు ఆ సబ్జెక్టుపై పట్టు ఉంటుంది. ఆసక్తి ఉన్న సబ్జెక్టులను మాత్రమే తీసుకోవాలి. పరీక్ష రాసే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని సమయాలను కేటాయించాలి. ఎక్కువ గంటలు చదవడానికే కేటాయించకుండా.. మధ్యలో సాయంత్రం, ఉదయం వేళల్లో వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. అప్పుడే మైండ్ ఫ్రీ అవుతుంది. ఒత్తిడి ఎక్కువ పెట్టకూడదు.
ముఖ్యంగా పరీక్షల్లో మార్కులు సాధించాలంటే మాక్ టెస్టులు ఎక్కువ రాయాలి. కోచింగ్ సెంటర్ల వద్ద గతంలో తయారు చేసిన పరీక్ష పేపర్లు ఉంటాయి. వాటిని తరచూ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాస్తారో అంత ఈజీగా పరీక్షలో మార్కులు సాధించవచ్చు.
దీంతోపాటు తెలియని ప్రశ్నలుంటే ఇంటర్నెట్ను వినియోగించుకోవాలి. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆన్లైన్ పాఠాలను కూడా వినాలి. దీంతో తెలియని ప్రశ్నల సమాధానాలు సైతం మనకు తెలిసే అవకాశముంటుంది.
చదువుకోవడానికి ఇంటి వద్ద అనుకూలంగా లేనప్పుడు గ్రంథాలయాలను కూడా ఎక్కువగా వినియోగించుకోవచ్చు. గ్రంథాలయాల వద్ద చదువుకొని జాబ్ సాధించిన వాళ్లు చాలా మంది ఉన్నారు. లైబ్రరీల్లో ఎక్కువ మెటీరియల్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాటిల్లో ఎక్కువ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా వినియోగించుకోవాలి. ప్రిపేర్ అయ్యేవాళ్లు గ్రంథాలయాలకు ఎక్కువగా వస్తుంటారు. దీంతో సబ్జెక్టులు, ప్రిపరేషన్ వంటి వాటిపై వారితో డిస్కస్ చేసే వీలు కలుగుతుంది. ఫలితంగా మరింత సమాచారం తెలుస్తుంది.