రామవరం, జూన్ 3: ‘ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర మరువలేనిది. రాష్ట్ర సాధన కోసం ఆయన ఎత్తుగడలు, వాక్చాతుర్యంతో హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధతుల్లో రాష్ర్టాన్ని సాధించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ప్రగతి వనంలో సింగరేణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర సాధన సమయంలో కేసీఆర్‌కు వెన్నంటి ఉండి నడిపించిన ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్‌రావు, మేధావులు, కవులు, కళాకారులు, కార్మిక, కర్షక లోకం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కలిసి కొట్లాడటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్లలో సింగరేణి సంస్థ ఒకటి అని, దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద సంస్థ సింగరేణి అని అన్నారు. సింగరేణి కార్మికులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా విపత్తు సంభవిస్తే తమవంతు సాయంగా విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యమంలో ఏమీ ఆశించకుండా మనస్సు, ధ్యాస, శ్వాస తెలంగాణ అని నమ్మి సకల జనుల సమ్మెలో 42 రోజులపాటు పాల్గొని తెలంగాణపై వారికున్న మక్కువను చాటారన్నారు. అనంతరం ఉత్తమ కార్మికుడిగా ఎన్నికైన గట్టయ్యను సింగరేణి యాజమాన్యంతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం శాలెంరాజు, ఎస్వోటు జీఎం కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ సూర్యనారాయణ రాజు, ఏజీఎం సివిల్ రామకృష్ణ, ఆర్‌సీహెచ్‌పీ ఎస్ఈ కరీముల్లా, క్వాలిటీ మేనేజర్ మదన్మోహన్, ఐఈడీ డీవీఐజీఎం యోహాన్, డీవైపీఎం శివకేశవరావు, మురళి, పలు సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.