మధిర, జూలై 31 : కట్టలేరుపై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌కు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువస్తే 400 ఎకరాలు సాగు అవుతుందని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాల్‌రావు అన్నారు. గురువారం మండలంలోని తొర్లపాడు గ్రామంలో కట్టలేరుపై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను రైతుల విజ్ఞప్తి మేరకు సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ.. తొర్లపాడు గ్రామంలోని కట్టలేరుపై నాటి కమ్యూనిస్టు ఉద్యమ నేత నల్లమల గిరి ప్రసాద్ సహకారంతో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తర్వాత కాలంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై లిఫ్ట్ మోటర్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫారాలు, పైపులు, లిఫ్ట్ కాల్వలు అన్ని నిరుపయోగంగా మారాయన్నారు. లిఫ్ట్ కోసం కట్టలేరుపై చెక్ డాం నిర్మించిన ప్రభుత్వం నీటిని రైతులకు అందించడంలో విఫలమైందన్నారు.
లిఫ్ట్‌కు అవసరమైన పరికరాలు సమకూర్చడం, రిపేర్లు చేయించడంలో అధికారులు కానీ, ప్రభుత్వం గానీ ఆసక్తి చూపలేదన్నారు. కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డాం నిరుపయోగంగా మారిందని, చెక్ డాం పూడికతో నిండిపోయి రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అధికారులు వెంటనే రిపేర్లు చేయించి రైతులకు రెండు పంటలు పండించుకునేందుకు నీళ్లు అందించాలని స్థానిక రైతులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు శీలం నర్సింహారావు, మండల కార్యదర్శి మందా సైదులు, డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య, ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్, గ్రామ నాయకుడు మద్దాల ఏబు, రైతులు సూర్య ప్రకాష్ రెడ్డి, వీరారెడ్డి, కాశిబోయిన శ్రీనివాసరావు, మధవరావు, గోపి, శీరం రమేశ్, అక్షయ్, గంజినబోయిన శివ పాల్గొన్నారు.