సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 18 : ‘గంగా తరంగ రమణీయ జటా కలాపం.. గౌరీ నిరంతర విభూషిత వామ భాగం.. నారాయణ ప్రియమనంగ మదాపహారం.. వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్..’ అనే కాశీ విశ్వేశ్వరుని స్తోత్రంతో సత్తుపల్లి పట్టణం ప్రతిధ్వనించింది. ‘కాశీ విశ్వేశ్వరా.. శరణు.. శరణు..’ అంటూ భక్తులు శివయ్యను కొలిచారు. మొత్తానికి గుడిపాడు రోడ్లోని దుర్గాపార్వతి సహిత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, ధ్వజస్తంభ స్థాపన అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు తుని తపోవన పీఠాధిపతి సచ్చితానంద సర్వసతిస్వామి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
స్వామికి ఎమ్మెల్యే మట్టా రాగమయి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ స్వాగతం పలికారు. వేదపండితులు హోమం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వేడుకలను తిలకించేందుకు పట్టణంతోపాటు పలు గ్రామాల నుంచి భారీగా భక్తులకు విచ్చేశారు. మహిళా భక్తులు బోనాలు వండి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించారు. వైదిక కార్యక్రమాలకు కొల్లి నాగేశ్వరరావు ఆర్థిక సాయం అందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు కొల్లి నర్సింహారావు, కొల్లి వెంకటేశ్వరరావు, నున్నా రత్నారావు చూసుకున్నారు.