ఖమ్మం సిటీ, ఆగస్టు 24: జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లు జనన, వైద్య పరీక్షల వివరాలను తప్పనిసరిగా బర్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి ఆదేశించారు. బుధవారం ఖమ్మంలోని డీహెంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు, డాక్టర్లతో ‘ఈ-బర్త్, ఐహెచ్, ఐపీ, ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్’ అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు వారి వద్ద జరిగే ప్రసవాల వివరాలను ‘ఈ-బర్త్’ పోర్టల్‌లో ఆన్లైన్ చేయడం వల్ల పూర్తి సమాచారం తెలిసే వీలుంటుందన్నారు. సాధారణ ప్రసవాలు, సీ సెక్షన్ స్థితిగతులు తెలుస్తాయన్నారు. ప్రతి ల్యాబ్‌లో చేసుకున్న వైద్య పరీక్షల వివరాలను సైతం ఇంటిగ్రేటేడ్ హెల్త్ ఇన్ఫర్మేమేషన్ ప్లాట్‌ఫాంలో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో ప్రతి ఆసుపత్రీ నమోదు కావాలన్నారు.
వాటికి సంబంధించిన పత్రాలను ఐఎంఏ గ్రూపులో జతపరిచామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులో పనిచేసే సిబ్బంది 18 ఏళ్లు నిండిన వారు రెండో డోస్ కొవిడ్ టీకా వేసుకోవాలని, ఆరు నెలల తరువాత ప్రీ కాషన్ డోస్‌ను తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీహెంహెచ్‌వో డాక్టర్ రాంబాబు, ప్రోగాం ఆఫీసర్లు సైదులు, మోత్యా, ఎస్డీపీవో నిలోహన, డిప్యూటీ డెమో సాంబశివరెడ్డి, డీడీఎం కృష్ఱమోహన్ తదితరులు పాల్గొన్నారు.