కారేపల్లి, ఆగస్టు 11 : ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్ (జంక్షన్)లో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న కాకతీయ ప్యాసింజర్ రైలు సుమారు గంటకు పైగా నిలిచిపోయింది. కారేపల్లి పెద్ద చెరువు సమీపంలోని క్యాబిన్ వద్ద గల రైల్వే విద్యుత్తు లైన్‌కు సోమవారం తెల్లవారుజామున కోతులు గుంపులు గుంపులుగా వచ్చి వేలాడాయి. దాంతో అందులోని ఓ కోతికి విద్యుత్ ప్రసారమై అక్కడికక్కడే మరణించగా కరెంట్ తీగ క్రిందకు వేలాడింది. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలుని కారేపల్లి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. మరమ్మతుకు సుమారు గంటకు పైగా సమయం పట్టడంతో ప్రయాణికులు అసౌకర్యానికి లోనయ్యారు.