ఖమ్మం రూరల్, మే 17 : మున్నేటిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో పాటు ఖమ్మం-మహబూబాద్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగం నగర్, తాళ్లేసితండాలో పార్టీ జిల్లా బృందం పర్యటించింది. ఇందులో భాగంగా జరగనున్న ఇళ్ల తొలగింపు నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జలగం నగర్లో పేదలు 45 సంవత్సరాలుగా గూడు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క గదిలో రెండు, మూడు కుటుంబాల నివాసం ఉంటున్నాయన్నారు.
వీరంతా అత్యంత నిరుపేదలని కేబుల్ బ్రిడ్జి ఏర్పాటుతో నిరాశ్రయులు అవుతున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలన్నదే తమ సంకల్పం అన్నారు. అధికారులు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా నిరాశ్రయులను చేయడం దారుణమన్నారు. అలాగే తాళ్లేసితండా వద్ద రోడ్డు వెడల్పులో భాగంగా తొలగిస్తున్న ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవానికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఇల్లు కోల్పోతున్న వారికి నష్ట పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఆదుకోవాలని కోరారు. సమస్యను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధినేని కర్ణకుమార్, సింగు నరసింహారావు, మిడకంటి చిన్న వెంకటరెడ్డి, అజ్మీరా రామ్మూర్తి, జిల్లా సమితి సభ్యుడు ఉన్నాం రంగారావు, బానోతు రామకోటి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గాదె లక్ష్మీనారాయణ, మహిళా సంఘం జిల్లా నాయకులు పోటు కళావతి, సీతామహాలక్ష్మి, మండల సమితి సభ్యులు పాసంగుల చందర్రావు, రావూరి రామచంద్రయ్య, రావుల శ్రీనివాస్, పసుపులేటి శ్రీను, పసుపులేటి లక్ష్మయ్య, పొన్నబోయిన అంజిబాబు, దేవసేట్టి వెంకన్న, బానోతు దేవ, బోడా బాలాజీ, శ్రీను, భూక్య నాగరాజు, దండి రంగారావు, వెంపటి సురేందర్, వెన్నం భాస్కర్, బట్ట బాబు, మెల్లచెర్వు గురువయ్య, యువజన సంఘం సభ్యులు మిరియాల నరుణ్ తేజ్, ధనియాకుల మహేశ్, పొన్నెకంటి రమేశ్, చల్లా రామకృష్ణ , రెబ్బగొండ్ల గోపి, చింతల ఉదయ్ పాల్గొన్నారు.
Khammam Rural : మున్నేటి కేబుల్ బ్రిడ్జి బాధితులకు న్యాయం చేయాలి : సీపీఐ నేతలు