ఖమ్మం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో పెద్దపల్లి కలెక్టర్‌గా పనిచేస్తున్న ముజామ్మిల్ ఖాన్‌ను నియమించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలను బదిలీ చేసి.. ఆమె స్థానంలో జతీశ్ వీ పాటిల్‌ను కలెక్టర్‌గా నియమించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 2021 అక్టోబర్ 20వ తేదీ నుంచి పనిచేస్తున్న ఆదర్శ్ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న సత్యప్రసాద్‌ను జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా నియమించింది. 2023 జూలై 15వ తేదీ నుంచి భద్రాచలం ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న ప్రతీక్ జైన్‌ను వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బదిలీ అయిన ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురు అధికారులు కలెక్టర్లుగా నియమితులు కావడం విశేషం. వీపీ గౌతమ్, ప్రియాంక ఆలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం నగర మున్సిపల్ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఐటీడీఏ పీవో స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. ఒకటీ రెండ్రోజుల్లో నియమించే అవకాశం ఉంది.
సుదీర్ఘకాలం ఖమ్మం కలెక్టర్‌గా పనిచేసిన వీపీ గౌతమ్ జిల్లాపై పాలనాపరంగా తనదైన ముద్ర వేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచేలా చేసి అప్పటి ప్రభుత్వ, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని ఖమ్మం జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన చింతకాని మండలంలో ఈ పథకం వందశాతం అమలయ్యేలా చేసి లబ్ధిదారుల మన్ననలు పొందారు. ఉపాధి అవకాశాలను మూస పద్ధతిలో కాకుండా ఏయే రంగంలో వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉందో పరిశీలించి వినూత్న ఆలోచనలు కల్పించి, ఉపాధి మార్గాలను అన్వేషించి దళితబంధుకు ఎంపికైన వారికి ఆయా రంగాల్లో అవగాహన, శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న అధికారిగా గుర్తింపు పొందారు. గత ఏడాది జరిగిన శాసనసభ, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారి, గ్రీన్‌ఫీల్డ్ హైవే, మూడో రైల్వేలైన్‌కు అవసరమైన భూసేకరణ చేయడంలోనూ, భూ నిర్వాసితులకు పరిహారం అందించడంలోనూ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత జూలై నెలలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక ఆల సౌమ్యురాలిగా, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత సంవత్సరం గోదావరి వరదల సమయంలో బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు.
పాలనాపరమైన అంశాల్లో నిక్కచ్చిగా ఉంటామని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరొందారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆదర్శ్ సురభి ఖమ్మం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. లకారం ట్యాంక్‌బండ్ ఆధునీకరణ, పార్క్‌ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ వంటి అంశాల్లో సురభి తనదైన ముద్ర వేసి పాలనాదక్షతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఏడాది క్రితం సిరిసిల్ల నుంచి ఖమ్మం వచ్చిన సత్యప్రసాద్ స్థానిక సంస్థల వ్యవహారాలపై మంచి పట్టున్న అధికారిగా నిబద్ధత కలిగిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సమస్యలను సత్వరం పరిష్కరించడంలో అగ్రగామిగా ఉంటారని, క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పాలనాపరమైన పట్టు సాధించారన్న పేరుపొందారు. ఐటీడీఏ పీవోగా గత జూలైలో బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ సౌమ్యుడిగా, పాలనాదక్షత కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. గిరిజనుల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహనా కలిగిన అధికారిగా, క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం ద్వారా గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అధికారిగా పేరుపొందారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించడానికి తీవ్రస్థాయిలో కృషి చేశారు. భద్రాచలంలో గోదావరి వరదల సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు వసతి సౌకర్యాలు కల్పించిన అధికారిగా గుర్తింపు పొందారు.