భద్రాచలం, జూన్ 4: గిరిజన మహిళలు, యువతులు కుట్టు శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పొందాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో గిరిజన మహిళల కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. శిక్షణ పొందిన తర్వాత జీవనోపాధి కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారని అడిగి తెలుసుకున్నారు.
నెలరోజుల శిక్షణ ద్వారా మెళకువలు నేర్చుకోవాలని, తర్వాత ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా కుట్టు మిషన్ కేంద్రాలు నడుపుకొని ఉపాధి పొందాలన్నారు. రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడింగ్పై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తామని, అవసరం ఉన్న మహిళలకు ముద్ర లోన్‌తో తక్కువ వడ్డీతో కుట్టు మిషన్లు ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, శిక్షకురాలు వైదేహి, గిరిజన మహిళలు పాల్గొన్నారు.
గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఐటీడీఏ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని పీవో రాహుల్ తెలిపారు. శిక్షణ పొందే యువతకు వసతి, భోజన సౌకర్యం, శిక్షణ నేర్పించే కేంద్రాలు, వైటీసీ పీఈటీసీ, ఎన్ఆర్సీలో ఖాళీగా ఉన్న గదులను బుధవారం ఆయన పరిశీలించారు. త్వరలోనే పూర్తిస్థాయి శిక్షణ అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. పీవో వెంట ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమేశ్, క్రీడల అధికారి గోపాలరావు ఉన్నారు.