భద్రాచలం, మార్చి 13 : ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా, చూడగానే కొత్త అనుభూతి కలిగే విధంగా గిరిజన మ్యూజియంను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యూజియం పనులు 22వ తేదీలోగా పూర్తిచేసి శ్రీరామ నవమి నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
గిరిజనుల పాత కాలపు ఇంటి నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టామని, కోయ కల్చర్‌కు సంబంధించి పెయింటింగ్ చిత్రాల పనులు చివరి దశకు వచ్చాయన్నారు. బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ చెరువు, ఆర్చరీ గ్రౌండ్ పనులు సోమవారం నాటికి పూర్తవుతాయన్నారు. మ్యూజియంను సందర్శించే పర్యాటకులు, భక్తులకు గిరిజన వంటకాలకు సంబంధించి స్టాల్స్ అందుబాటులో ఉంచుతామని, గిరిజన వంటకాలతోపాటు చైనీస్ ఫుడ్, కోయ కల్చర్ బొమ్మలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
గిరిజన కల్చర్‌కు సంబంధించి ప్రతీ అంశం తెలుసుకునేలా.. చరిత్రను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ఈఈ చంద్రశేఖర్, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, డీఈ హరీశ్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, ఏఎస్వో నర్సింగరావు, ఏపీవో పవర్ వేణు, డీఎస్వో ప్రభాకర్‌రావు, ఈవో జీపీ శ్రీనివాసరావు, హెచ్‌వో చిట్టిబాబు, మ్యూజియం ఇంచార్జి వీరాస్వామి పాల్గొన్నారు.