భద్రాచలం, మార్చి 7: శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా రద్దీ కూడళ్లు, భక్తులు బస చేసే ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవంతం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశించారు. భద్రాచలంలో కాపా రామలక్ష్మి, బస్టాండ్, జూనియర్, డిగ్రీ కాలేజీ, పార్కు పక్కన తాత్కాలికంగా, శాశ్వతంగా నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులు బస చేసే ప్రదేశాల్లో నీటి సమస్య తలెత్తకుండా టాయిలెట్లు నిర్మించాలని, స్నానపు గదులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ తాత్కాలిక మరుగుదొడ్ల పనులకు కూలీలను ఎక్కువగా వినియోగించి ఈ నెల 25 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఏఎంసీ కాలనీ, మనుబోతుల చెరువు దగ్గర ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల డైనింగ్ హాలు పనులను పరిశీలించారు.