భద్రాచలం, డిసెంబర్ 2 : గిరిజన కుటుంబాలలో అర్హులైన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించిన ఏపీవో.. తన పరిధిలోని వాటిని వెంటనే పరిష్కరించారు. మిగిలిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.
ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక సాయం, గురుకులం సీట్లు, పై చదువులకు ఆర్థిక సాయం తదితరాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు. గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలను ఆన్లైన్ చేయించి, ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, ఆర్సీవో గురుకులం నాగార్జునరావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఎస్వో భాస్కర్, ఏపీవో పవర్ ఏఈ మునీర్‌పాషా, ఎస్డీసీ ఉదయ్‌కుమార్, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మణిధర్ తదితరులు పాల్గొన్నారు.