ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 5: ‘ఇంతింతై.. వటుడింతై..’ అన్నట్లుగా విజ్ఞాన శిఖరమైంది ఖమ్మం నగరంలోని ‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్’ కళాశాల. ఏడు దశాబ్దాల్లో కాలానుగుణంగా మెరుగైన ఉపాధికి బాటలు వేసే కోర్సులను ప్రవేశపెట్టింది. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకుంటున్నది. వారికి విద్యను ప్రసాదించి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గౌరవ ప్రతిష్ఠలను తెచ్చిపెడుతున్నది. ‘ఏ స్థాయిలో ఉన్నా నన్ను మరువొద్దు..’ అంటూ దీవెనలు అందజేస్తున్నది. యూనివర్సిటీలను తలదన్నేలా తన పేరును సార్థకత చేసుకుంటున్నది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తున్నదీ కళాశాల. ఇటీవల న్యాక్ ఏ++ గ్రేడ్ సాధించి రాష్ట్రంలో ఏకైక కళాశాలగా అరుదైన గుర్తింపు సాధించింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యాప్రస్థానంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
ఖమ్మం నగరంలోని శ్రీరామభక్త గెంటేల నారాయణరావు (ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్) ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. యూనివర్సిటీలకు దీటుగా రికార్డులు సాధించింది. 1956 నుంచి ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులు కళాశాలలో చదివి విద్యావంతులయ్యారు. సాధారణ కళాశాలగా ప్రారంభమై దినదిన ప్రవర్థమానం చెందుతూ ‘అటానమస్’ సాధించింది. యాజమాన్యం విద్యార్థులకు కావాల్సిన వసతులు, తరగతి గదులు, అధునాతన ల్యాబోరేటరీలు నిర్మించింది. ఇటీవల కళాశాల సాధించిన ఐదేళ్ల వార్షిక ప్రగతిని ‘నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం పరిశీలించి కళాశాలకు ఏ++ గ్రేడ్ అందించింది. కళాశాల అభివృద్ధికి రూ. 4 కోట్ల నిధులు అందిస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా కళాశాల వెలుగు జిలుగులపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
కళాశాల స్థాపన ఇలా..
1956లో నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కేవలం ఆంధ్రా ప్రాంతంలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఒక డిగ్రీ కళాశాల నిర్మించాలని సంకల్పించారు. అందుకు దాతలు ముందుకు వస్తే వారి సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. ఖమ్మంలో కళాశాల నిర్మాణానికి నాటి విద్యావేత్తలు జగ్గయ్యపేటకు చెందిన గెంటేల నారాయణరావు కుటుంబాన్ని సాయం కోరారు. నారాయణరావు అప్పట్లోనే రూ.లక్ష సాయం అందించారు. ఆ సొమ్ముతో ఇల్ల్లెందు క్రాస్‌రోడ్‌లో 69 ఎకరాల స్థలాన్ని రూ.40 వేలతో కొన్నది. మిగిలిన రూ.60 వేలతో భవనాలను నిర్మించింది. నారాయణరావు శ్రీరాముడి భక్తుడు కావడంతో ఈ కళాశాలకు ‘శ్రీరామభక్త గెంటేల నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల’గా నామకరణం జరిగింది. 1956లో మార్కెట్ యార్డ్ అద్దె భవనంలో డిగ్రీ కోర్సు ప్రారంభం కాగా 1963 నాటికి భవన నిర్మాణం పూర్తయి కోర్సులు కళాశాలలో ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోనే తొలి న్యాక్ ఏ++ డిగ్రీ కళాశాల..
1979-1980 వరకు కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు కోర్సులు ఉండేవి. ఖమ్మంలో అల్లూరి శ్రీరామరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించిన తర్వాత ఈ కళాశాల పూర్తిస్థాయి డిగ్రీ కళాశాలగా ఆవిర్భవించింది. 1985-86 వరకు(నైట్) కళాశాలగా నడిచింది. అప్పటివరకు కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఉండేది. 1986లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చింది. అప్పుడు డిగ్రీలో కేవలం మూడు కోర్సులు ఉండేవి. కేవలం 279 మంది విద్యార్థులు ఈ మూడు కోర్సులు చదివేవారు. 1996లో కంప్యూటర్ కోర్సులు ప్రారంభమయ్యాయి. 2015-16లో కళాశాల అటానమస్ సాధించింది. 2004లో న్యాక్ బీ గ్రేడ్, 2011లో న్యాక్ బీ+, 2017లో న్యాక్ బీ ++ సాధించింది. తాజాగా 2023లో న్యాక్ ఏ++ (3.64 సీపీజీఏ) సాధించింది. ‘రాష్ట్ర కళాశాల విద్యా కమిషనరేట్’ పరిధిలో 138 డిగ్రీ కళాశాలలు ఉండగా ఈ కాలేజీ అరుదైన ఘనత సాధించింది.
ప్రముఖులంతా కళాశాల పూర్వ విద్యార్థులే..
ఏడు దశాబ్దాలుగా ఇక్కడ చదివిన వారు ఎంతోమంది ప్రముఖులుగా ఎదిగారు. కీర్తిప్రతిష్ఠలు సాధించారు. వారంతా రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో స్థిరపడ్డారు. దేశ, విదేశాల్లో తమ హవా కొనసాగిస్తున్నారు. కళాశాలలో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాదు పొరుగు జిల్లాల నుంచీ వచ్చి చదువుతుండడం గమనార్హం. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభసభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాలకోటేశ్వరరావు, వామపక్ష పార్టీల నేతలు పోటు రంగారావు, పోతినేని సుదర్శన్, బాగం హనుమంతరావు ఈ కళాశాల పూర్వ విద్యార్థులే.
కళాశాలలో వసతులు ఇలా..
కళాశాల యాజమాన్యం విద్యార్థుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నది. విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలలో 400 కంప్యూటర్స్ ఉన్నాయి. దీనితో పాటు ఒక డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నది. విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంచేందుకు యాజమాన్యం బుక్ రీడర్స్ క్లబ్ ఏర్పాటు చేసింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్స్, ప్రాక్టికల్స్ గదులు, నూతన భవనాలు, సీసీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. తాగునీటి, టాయిటెట్స్ వసతి ఉంది. కళాశాల పరిధిలో 15.5 ఎకరాల ఆటస్థలం ఉంది. 6.5 ఎకరాల్లో ఆర్బోరేటం(సహజంగా పెరిగే అడవి) ఉంది. వీటిలో 259 రకాల ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. కళాశాల పరిధిలో ఆర్కియాలజీ మ్యూజి యం ఉంది. ‘మన ఊరు- మన చరిత్ర’ ప్రాజెక్ట్ ఈ కళాశాల నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం డిగ్రీలో 45 కోర్సులు నడుస్తున్నాయి. సుమారు 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పీజీలో తొమ్మిది గ్రూప్‌లు ఉండగా 800 మంది చదువుతున్నారు. 104 మంది అధ్యాపకులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరిలో 47 మంది డాక్టరేట్స్ సాధించినవారే. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలుగు విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతులు వచ్చాయి. ఈ ప్రమాణాలన్నీ కళాశాల న్యాక్ గ్రేడ్ సాధించేందుకు దోహదం చేశాయి. కళాశాల అభివృద్ధికి కేంద్రం రూ.4 కోట్ల నిధులు విడుదల చేసేందుకు బాటలు వేశాయి.
సంతోషంగా ఉంది..
నాన్న ఆరోజు ఏ ఉద్దేశంతో కళాశాల స్ధాపనకు కృషి చేశారో ఇప్పుడా ఫలాలు విద్యార్థులకు అందడం సంతోషాన్నిస్తున్నది. ఇప్పుడు న్యాక్ ఏ++ గ్రేడ్ సాధించడం యావత్ ఖమ్మం జిల్లాకే గర్వకారణం. కళాశాల అభివృద్ధికి విద్యార్థులందరూ కృషి చేయడం మరింత ఆనందాన్నిస్తున్నది. ప్రభుత్వం కూడా కళాశాలకు అవసరమైన వనరులు కల్పిస్తున్నది. కళాశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రతి విద్యార్థి, పూర్వ విద్యార్థి కాపాడుకోవాలి.
– గెంటేల నారాయణరావు దత్తత కుమారుడు వెంకట శేషగిరి శ్రీనివాసరావు
న్యాక్ గుర్తింపు ఆనందదాయకం..
ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్ఠాత్మకమైన న్యాక్ ఏ++ గ్రేడ్ రావడం ఆనందదాయకం. కళాశాల ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు యాజమాన్యం అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తూ వస్తున్నది. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం కళాశాల ప్రత్యేకత. అలాంటి కళాశాలలలో నేనూ చదవడం గర్వకారణం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ముందుతరాలకు జ్ఞానదీపం కళాశాల..
భిన్న సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా కళాశాల తీర్చిదిద్దుతున్నది. ఏడు దశాబ్దాలుగా విద్యాకేంద్రంగా విరాజిల్లుతున్నది. కళాశాలలో చదువుకున్న ఎంతోమంది దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. శాస్త్ర, సాంకేతిక, విద్యా, వ్యాపార, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు సంపాదించారు. కాలానుగుణంగా యాజమాన్యం వినూత్నమైన కోర్సులు ప్రవేశపెట్టి ముందు తరాలకు జ్ఞనదీపంలా నిలుస్తున్నది. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నది.
– డాక్టర్ రావులపాటి సీతారాం, అసోసియేట్ ప్రొఫెసర్, కాళోజీ అవార్డు గ్రహీత, కేయూ ఈసీ సభ్యుడు, పూర్వ విద్యార్థి