ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు అది అందుబాటులోకి రాలేదు. విద్యార్థులకు ప్రయోగాలతో కూడిన బోధనను అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంది. సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు పాత డీఈవో కార్యాలయాన్ని కేటాయిస్తూ 2023 జనవరిలో అప్పటి కలెక్టర్ వీపీ గౌతమ్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతోపాటు రూ.50 లక్షల నిధులను వెచ్చించి ఆగస్టులో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. అయితే మ్యూజియం ముస్తామైనప్పటికీ దాని ప్రారంభానికి మోక్షమెప్పుడో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఆచరణలో ఆమడ దూరం…
‘సైన్స్ అంటే మక్కువ పెరగాలి. ఫిజిక్స్, బయాలజీ అంటే భయం పోవాలి. పాఠశాల స్థాయి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి’ అనే మాటలను విద్యాశాఖాధికారులు పదేపదే వల్లె వేస్తున్నారు. కానీ అమల్లోకి వచ్చేసరికి అవి కార్యాచరణ దాల్చాడం లేదు. మ్యూజియాన్ని ముస్తాబు చేసి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు దాని ఫలాలు అందాలంటే వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆశయాల గురించి గొప్పగా చెప్పే విద్యాశాఖ.. సైన్స్ మ్యూజియం ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఆగింది. మరోవైపు ఈ మ్యూజియం నిర్వహణకు నిధుల కొరత కూడా లేదు. సీఎస్ఆర్ ఫండ్స్ కింద నివోసాల్ అనే సంస్థ కూడా రూ.20 లక్షలు అందించింది. అయినప్పటికీ అది ఎంకు ప్రారంభానికి నోచుకోవడం లేదో సంబంధిత అధికారులకే తెలియాలి మరి.
మార్పులు చేసి ఏడాది పూర్తి..
జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు దిశగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేసింది. 2023 ఆగస్టులోనే పాత డీఈవో కార్యాలయాన్ని సైన్స్ మ్యూజియంగా చేసింది. పరికరాలు ఏర్పాటు చేసేందుకు వీలుగా మార్పులు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో మార్పులతోపాటు భవనం చుట్టూ జాలీని ఏర్పాటు చేశారు. ఇందుకు సుమారు రూ.19 లక్షలు కేటాయించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలు, వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు పర్చారు. వాటికి సంబంధించిన నిధులను కూడా సైన్స్ ఆఫీసర్, డీఆర్వో జాయింట్ అకౌంట్లో అందుబాటులో ఉంచారు. రూ.50 లక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోంచే మరమ్మతులకు నిధులు కేటాయించి పూర్తి చేశారు.
సమకూరిన పరికరాలు..
జిల్లాలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సైన్స్, సోషల్, గణితంలోని ముఖ్యమైన అంశాలను ప్రయోగాత్మకంగా వివరించేందుకు నిపుణుల ఆధ్వర్యంలో 27 అంశాలను ఎంపిక చేశారు. వీటి కోసం రూ.40 లక్షలు వెచ్చించి పరికరాలను బిగించారు. బిర్లా సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారు రెండు వితల్లో పనులు పూర్తి చేశారు. జూలై మొదటి వారంలో పరికరాలను తీసుకొచ్చి సైన్స్ మ్యూజియంలో అమర్చారు. తరగతులు వారీగా ఏయే పరికరాలు ముఖ్యమైనవనే వాటితో పాటు ముఖ్యంగా జీవశాస్త్రంలోని అన్ని పరికరాలకు ప్రాధాన్యం కల్పించారు. ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్ ఫోరం టీచర్లు మ్యూజియం పనుల్లో భాగస్వాములయ్యారు. ఈ సైన్స్ మ్యూజియాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత డీఈవోలు ఎంతో శ్రమించారు. కానీ ఇప్పటికీ దాని ఫలితాలు విదార్థులకు అందడం లేదు.