కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు 2024 జూలై నెలలో తెగిపోవటంతో వరద కాలువ కింద ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీనిపై బాధిత కుటంబాలకు రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వం రూ.10 వేల సాయంతోపాటు బియ్యం పంపిణీ చేసింది. ఈ దశలోనే ఆగస్టు నెలలో పర్యటించిన మంత్రి పొంగులేటి బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ మొదటి విడతలో వారికి మొండిచెయ్యి చూపించారు. రెండోవిడతలోనైనా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా ప్రైవేట్ స్థలంలో తాత్కాలికంగా నిర్మించుకున్న గుడిసెల్లోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.
– అశ్వారావుపేట, జూన్ 21
అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు రాష్ర్టాలకు సాగునీరు అందించే పెదవాగు ప్రాజెక్టు 2024 జూలైలో కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో ప్రాజెక్టు కాలువ కింద ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లు కొట్టుకుపోవటంతో బాధిత కుటుంబాలు వీధినపడ్డాయి. స్పందించిన రెవెన్యూ అధికారులు హుటాహుటిన నష్టం అంచనా వేశారు. సుమారు 16 ఇళ్లు కొట్టుకుపోయినట్లు నిర్ధారించారు. వారికి తక్షణ సాయం కింద రూ.10 వేలు నగదు, బియ్యం పంపిణీ చేశారు. ఆగస్టు నెలలో రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలిసిన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ గత ఏడాదిలో మంజూరైన మొదటివిడతలో ప్రభుత్వం 16మంది బాధితుల్లో కేవలం నలుగురికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మిగతా వారిని గాలికి వదిలేసింది. ఇప్పటికైనా మంత్రి హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఆశతో ఆ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇంటి నిర్మాణాలకు ఇసుక కూడా దిగుమతి చేసుకున్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. మొదటివిడతలో బాధిత కుటుంబాలందరికీ ఇళ్లు మంజూరు కాలేదు. రెండోవిడతలోనైనా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయనే గంపెడాశతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు.
హామీ మరిచిన మంత్రి పొంగులేటి?
రెండున్నరేళ్ళ క్రితం ఇచ్చిన హామీని మరిచిపోయారా మంత్రి వర్యా..? అంటూ బాధిత కుటుంబాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీని ఏమి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పటి నుంచి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తాత్కాలిక గుడిసెల్లోనే జీవితాలు వెళ్లదీస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు కనీసం పట్టించుకోకపోవటంతో తమ పరిస్థితి గాలిలో దీపంలా తయారైందని మదనపడుతున్నారు.
ప్రాజెక్టు కొట్టుకుపోవటంతో నిర్వాసితులమైనా తాము స్థానిక గ్రామ పెద్ద పుట్టా సత్యం స్థలంలో తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకుని జీవితాలు వెళ్లదీస్తున్నామని, సుదీర్ఘకాలంగా ఎండ, వానతో సహవాసం చేస్తూ అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. వానకాలంలో వీచే గాలులకు కొన్ని గుడిసెల పైకప్పులు సైతం ఎగిరిపోయాయని, అయినా బరకాలు కట్టుకుని మరీ అవే గుడిసెల్లో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రజా పాలనలో పేదల సంక్షేమం పట్టదా అంటూ పెదవి విరుస్తున్నారు. స్థానిక నాయకులు రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తున్నారని, బాధిత కుటుంబాల వైపు కన్నెత్తిచూడటం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండున్నరేళ్లుగా గుడిసెలోనే నివాసం
పెదవాగు ప్రాజెక్టు తెగిపోవటంతో ఇల్లు కొట్టుకుపోయింది. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కూడా అందింది. మొదటివిడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. దీంతో రెండున్నరేళ్లుగా తాత్కాలికంగా నిర్మించుకున్న గుడిసెలోనే పిల్లలతో నివసిస్తున్నాను. భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు.
– వల్లెపు నాగమణి, బాధిత మహిళ, గుమ్మడవల్లి
మంత్రి ‘పొంగులేటి’ హామీ ఇచ్చారు
ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ మొదటివిడతలో నాకు ఇల్లు మంజూరు చేయలేదు. అప్పటి నుంచి కుటుంబంతో గుడిసెలోనే కాలం వెళ్లదీస్తున్నాను.
– అల్లకుంట్ల చిట్టెమ్మ, బాధిత మహిళ, గుమ్మడవల్లి
ఇసుక కూడా తోలుకున్నాను..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారన్న ఆశతో ఇసుక కూడా తోలించుకున్నాను. కానీ మొదటివిడతలో ఇల్లు మంజూరుకాలేదు. రోజువారీ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నాను. సెంటు వ్యవసాయ భూమి కూడా లేదు. కూలీకి వెళ్తేనే రోజు గడుస్తుంది. రెండోవిడతలోనైనా ఇల్లు మంజూరు చేయాలి.
– తాళ్లూరి ఎర్రమ్మ, బాధిత మహిళ, గుమ్మడవల్లి