మామిళ్లగూడెం, జూలై 3: వరద ఉధృతి సమర్థవంతంగా అంచనా వేయాలని, అందుకోసం జిల్లాలో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్.. జిల్లా అధికారులను ఆదేశించారు. విపత్తుల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డితో కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. విపత్తుల సమాచారం మనకు ఎంత త్వరగా తెలిస్తే మనం కూడా అంతే త్వరగా ప్రజల చేరవేయవచ్చునని, రక్షణ చర్యలు కూడా తీసుకోవచ్చునని అన్నారు. నీటి వనరుల్లో నీటి నిల్వలు, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదల వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని సూచించారు.
భద్రాచలంలో వరద ఉధృతి సంబంధించి పకడ్బందీ వ్యవస్థ ఉందని, అక్కడ వరద వివరాలు ప్రతి గంటకూ తెలుస్తాయని గుర్తుచేశారు. ఆ దిశగా ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. తీర్థాల, మున్నేరు, ఆకేరు తదితర వాగుల వద్ద నీటి ప్రవాహాలు, నిల్వలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు.
జిల్లాలో అవసరమైన చోట వాటర్ గేజ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేయాలని, నీటి వనరుల్లోని నీటి మట్టాలు, వరద ప్రవాహాల వివరాలను ఎప్పటికప్పుడు అందులో అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. మున్నేటికి వరద పోటెత్తే సమయంలో తీవ్రతకు అనుగుణంగా ఒకటి, రెండు, మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వెంకట్రామ్, నర్సింహారావు, సైదులు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.