కారేపల్లి, జూన్ 2 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ పంచాయతీలో పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీలతో ఎక్కువగా భూములు ఉన్నవారికి, పక్కా ఇల్లు కలిగిన వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలుపుతూ బాధితులు సోమవారం బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎర్రటి ఎండలో మోకాలిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపల్లి పంచాయతీ వ్యాప్తంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న సంపన్న కుటుంబాలకు ఇండ్లను కేటాయిస్తున్నారని, ఎంపిక చేసిన లిస్ట్‌ను రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా పాలక పక్షానికి అనుకూలంగా ఇందిరమ్మ కమిటీ వారు పంపిన పేర్లను ఎంపిక చేస్తున్నారే తప్పా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం ఎంపిక చేయడం లేదన్నారు.
ఉన్నతాధికారులు ఇప్పటికైనా పరిశీలించి నిరుపేద, పూరి గుడిసెలో ఉన్న వారికి న్యాయం చేయాలని కోరారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్ట్‌ను గ్రామ పంచాయతీ బోర్డు నందు అతికించాల్సిన కార్యదర్శులు లిస్ట్ బయట పెట్టకుండా గోప్యంగా ఉంచినట్లు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గ్రామ కమిటీ సభ్యుడు పప్పుల వెంకటేశ్వర్లు, అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పప్పుల నిర్మల, బాధితులు అజ్మీర సరిత, శంకర్, ధార బక్కయ్య, అజ్మీర నగేశ్, ధారా రాంబాబు, పాయం భిక్షపతి, రవి, గుగులోత్ సుభద్ర, కోటం నాగమణి, అజ్మీర లక్ష్మి, విక్రమ్, గడ్డి రేణుక పాల్గొన్నారు.