ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 25: పోలీసు బందోబస్తు మధ్య ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరాయి. ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు ఆధ్వర్యంలో జనరల్-2, ఒకేషనల్-1 సెట్స్‌ను నయాబజార్ జూనియర్ కళాశాల కేంద్రంగా ఉన్న స్ట్రాంగ్ రూమ్‌కు బోర్డు అధికారులు మంగళవారం చేర్చారు. అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటల బందోబస్తు కల్పించాలని డీఐఈవో పోలీస్ కమిషనర్ సునిల్దత్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీస్ సిబ్బంది ఆయుధాలతో పహారా కాస్తున్నారు. కళాశాల పరిసరాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నప్పటికి పోలీసు సిబ్బంది కళాశాలకు సంబంధించిన వారిని కాకుండా ఇతరులను ఆ చుట్టుపక్కలకు అనుమతించడం లేదు.
ఇంటర్ బోర్డు పరీక్షల విభాగం అధికారులు జూనియర్ కళాశాలల లాగిన్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్‌కి సంబంధించిన హాల్ టికెట్లను పొందుపర్చారు. కొన్ని కళాశాలలు మినహా అత్యధిక కళాశాలలు మంగళవారం కావడంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయలేదు. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు ఏయే సెంటర్లు వచ్చాయో పరిశీలించారు.
కళాశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే తమ కార్యాలయంలో తెలియపర్చాలని డీఐఈవో రవిబాబు తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీలోగా తప్పులను గుర్తించి వెంటనే తెలియపరిస్తే మార్పులు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రిన్సిపాళ్లు విద్యార్థుల వివరాలు మరోసారి పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
ఇంటర్ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ల సమావేశం ఈ నెల 28న నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన నిబంధనల గురించి వివరించనున్నారు. కళాశాలల్లోని అధ్యాపకులతోపాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల వివరాలు తీసుకుని.. వారికి విధులు ఎక్కడ కేటాయించాలనే దానిపై ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పకడ్బందీగా ప్రక్రియ చేపట్టనున్నారు. సీఎస్, డీవోల సమావేశం అనంతరం ఇన్విజిలేషన్ విధులపై పూర్తి స్పష్టత రానున్నది.