భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మరో రెండు, మూడు నెలల్లో ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన సమయం. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో కీలకమైన సమయం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేసిన తప్పిదం విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని, ఇంకా పలు సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో వారంతా ఆ హామీలు నమ్మి ఓటు వేశారు. ఆ తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టింది. కానీ ఏడాది గడిచినా ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను మాత్రం ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. ధర్నాలు చేసినా స్పందించడం లేదు. దీంతో విసుగు చెందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు ప్రభుత్వ మెడలు వంచైనా సరే.. హామీలను అమలు చేయించాలని సంకల్పించారు. ఇందుకోసం అల్టిమేటం జారీ చేశారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో వారు సమ్మెకు దిగారు.
సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) సహా ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బంద్ అయింది. ధర్నాల కారణంగా భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో, ఒక బాలుర విద్యాలయంలో వారం రోజులుగా ఇప్పటికే పాఠ్యాంశాల బోధనకు అంతరాయం కలుగుతోంది. తాజాగా పాఠాలు చెప్పడం పూర్తిగా బంద్ చేశారు. కేవలం కొందరు సిబ్బంది వంట చేసి పిల్లలకు పెడుతున్నారు. దీంతో విద్యార్థులు హాస్టల్ గదులకే పరిమితమయ్యారు. కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తాజాగా ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగుల సమ్మెతో వీరి విద్యాబోధనకు అంతరాయం ఏర్పడింది.
గతంలో 3 రోజలపాటు ధర్నాలు చేసినా సర్కారు పట్టించుకోలేదు. దీంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మెకు దిగారు. సర్కారు దిగి వచ్చే దాకా సమ్మెను కొనసాగిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. గత రాత్రి విద్యాశాఖ డైరెక్టర్ చర్చలకు పిలిచి సమస్యలపై చర్చించారు. కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం వారికి మద్దతిస్తున్నాయి. దీంతో సర్వశిక్షా ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం..
మేము 24 గంటలూ విధుల్లోనే ఉంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. వారికిస్తున్న రూ.లక్షల వేతనాలు కాకపోయినా మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం? ఇంత దారుణంగా వెట్టిచాకిరీ చేయించుకుంటారా? మేము సమ్మెలో ఉన్నప్పటికీ.. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం పెడుతున్నాం. వారికి రక్షణ కల్పిస్తున్నాం. పాఠాలు మాత్రమే చెప్పడం లేదు. -తులసి, ఎస్వో, కేజీబీవీ పాల్వంచ
14 స్కూళ్లలో బోధన నడవడం లేదు..
సమ్మె కారణంగా భద్రాద్రి జిల్లాలో 14 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధన జరగడం లేదు. చివరికి భవిత పాఠశాలలు కూడా మూతబడ్డాయి. టెన్త్, ఇంటర్ పిల్లలకు పరీక్షలు దగ్గరకు వచ్చాయి. ప్రభుత్వ పంతం కారణంగా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మాకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. -కవిత, ఎస్వో, చండ్రుగొండ