తిరుమలాయపాలెం, జూలై 20: బచ్చోడు గ్రామంలోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో పోస్టుల భర్తీలో పలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో సోమవారం ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రీప్రైమరీ పాఠశాలల్లో అనర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించారని ఆరోపించారు. ఒకే కుటుంబానికి చెందిన వారికి ఇందిరమ్మ ఇల్లు, పాఠశాలలో ఉద్యోగాలు కల్పించడం అన్యాయమని మండిపడ్డారు. నిరుపేద కుటుంబానికి చెందిన, అర్హులైన నందిపాటి సృజన, రామనబోయిన రజితలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఆయా పార్టీల నాయకులు జక్కుల యాదగిరి, గుజ్జ రామకృష్ణ, సందు రాజు, గొర్రెపాటి రమేశ్, వేములపల్లి మల్లికార్జున, నందిపాటి లక్ష్మీనారాయణ, గొర్రెపాటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.