ఖమ్మం అర్బన్, జూలై 19 : ‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలల్లో ప్రభుత్వం భర్తీ చేయాలనుకున్న ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల విషయం ఖమ్మం జిల్లాలో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకే అగ్ర తాంబూలం వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెరిట్‌ను పూర్తిగా పక్కనబెట్టారని, సిఫార్సులు అందించిన అభ్యర్థులను అందలం ఎక్కించారని ఆరోపిస్తూ అర్హులైన అభ్యర్థులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ వ్యవహారంలో తగిన ఆధారాలతో నేరుగా గ్రీవెన్స్‌కు వెళ్లి సాక్షాత్తూ కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. మరికొంత అభ్యర్థులు సంబంధిత శాఖ అధికారులను కలిసి ఫిర్యాదులు అందజేశారు. పోస్టుల భర్తీ విషయంలో విద్యార్హతలు, స్థానికత వంటి నిబంధనలకు తూట్లు పొడిచారని; కొన్నిచోట్ల ఏకంగా వార్డు సభ్యులకు కూడా పోస్టులిచ్చారని ఆరోపించారు.
జిల్లాలోని ప్రై ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీ అంశంలో అనర్హులకు పెద్దపీట వేశారంటూ అర్హులైన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందుతున్నాయి. ఒక్కో ఫిర్యాదులో ఒక్కో నిబంధన ఉల్లంఘన జరిగిందనే విషయం రుజువులతో సహా బయటికొస్తోంది. దీంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పాతాళంలోనూ కన్పించడంలేదనే విషయం స్పష్టమవుతోంది. అసలు, ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎట్టకేలకు నియామక ప్రక్రియను ముగించినా, ఎంపికైన వారికి ఆర్డర్లు ఇచ్చినా అర్హులు మాత్రం న్యాయపోరాటం చేస్తున్నారు. సదరు పోస్టులకు తాము అర్హులమని చెబుతూ అధికారులకు తగిన ఆధారాలు సమర్పిస్తున్నారు. అదే సమయంలో సంబంధిత పోస్టుల్లో నియమించిన వారు అనర్హులని, వారి అనర్హతల ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు. వాటిని కూడా ఉన్నతాధికారులకు అప్పగిస్తున్నారు.
ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల భర్తీలో రాజకీయ ఒత్తిళ్లదే పైచేయిగా ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హతలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువైన కొన్ని ప్రాంతాల్లో ఏకంగా వార్డు సభ్యులకు కూడా ఈ పోస్టులు కట్టబెట్టిన పరిస్థితి ఉంది. ఈ పోస్టుల భర్తీ కోసం జూన్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు.. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ నిర్వహించలేదు. గత నెల రెండో వారానికి జాబితాను వెల్లడించి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. కానీ, అలా చేయలేదు. ప్రక్రియను బాగా ఆలస్యం చేశారు. ఈ నెల 13 నాటికి నియామకపత్రాలు అందజేశారు. మొత్తం 114 ఇన్స్ట్రక్టర్ పోస్టులకు 2,895 దరఖాస్తులు, 114 ఆయా పోస్టులకు 962 దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులు అత్యధికం అనర్హులకు అందడంతో అర్హుల నుంచి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. ఇంకా ఈ ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టర్ దివాకరను గ్రీవెన్స్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. తర్వాత రోజుల్లో సైతం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మరికొందరు అభ్యర్థులు ఫిర్యాదులు అందించారు. అర్హతలను పరిశీలంచలేదని, స్థానికత నిబంధనలను పక్కనబెట్టారని, ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. అయితే, గ్రీవెన్స్‌లో అందిన ఫిర్యాదులపై సమాధానాలు చెప్పాలని విద్యాశాఖను కలెక్టర్ ఆదేశించారు.
ప్రీ ప్రైమరీ స్కూళ్లలోని పోస్టుల భర్తీకి మండలాల్లో ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దార్లతో కూడిన కమిటీ ఏర్పడింది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం.. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. జాబితాను ఆర్డీవోకు అందజేసింది. ఆర్డీవో కూడా ఆ జాబితాను పరిశీలించి తుది జాబితాను రూపొందించారు. దానిని ఉన్నతాధికారులకు అందజేశారు. కానీ, చివరికి మాత్రం అనర్హులు ఎంపికయ్యారు. వారిలో వార్డు సభ్యులు కూడా ఉన్నారు. కామేపల్లి మండలం గరిడేపల్లి, గోవిందరాజుల బంజర పాఠశాలల్లో పోస్టులను అనర్హులకు కట్టబెట్టారని అక్కడి అర్హులు ఆరోపించారు. వారి ఫిర్యాదుల ఆధారంగా అధికారులు విచారించారు. దీంతో ప్రాథమికంగా వారు అనర్హులని గుర్తించినట్లు తెలుస్తోంది. 1:3 మెరిట్ జాబితాలో అర్హులు ఉండగా తుది జాబితాలోకి వచ్చేసరికి అసలైన అర్హులను పక్కనబెట్టడంపై లోపాయికారీ ఒప్పందాలు జరిగి ఉంటాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఇక స్థానికత అంశంపై కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే, ఇటీవల వివాహమై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు.. తామూ స్థానికులమేనంటూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కొన్ని చోట్ల వారు కూడా ఎంపికయ్యారు. దీనిపై అర్హులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాహానంతరం వచ్చిన వారు స్థానికులు ఎలా అవుతారని, ఆయా పోస్టుల్లో వారిని ఎలా ఎంపిక చేస్తారని అర్హులు ప్రశ్నిస్తున్నారు.
ఇక, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇతర కోర్సులు చేసిన వారిని ఎంపిక చేశారని అర్హులు ఆరోపిస్తున్నారు. నియామకాల ప్రక్రియ మొత్తంలో పారదర్శకత కనిపించడం లేదని; మెరిట్‌ను పూర్తిగా పక్కనబెట్టారని; కేవలం సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్న వారినే ఎంపిక చేశారని అర్హులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, చిన్నారులకు బోధించే కీలక పోస్టుల భర్తీలోనూ నిబంధనలకు తూట్లు పొడిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై వివరణ కోసం ఇన్చార్జి డీఈవో సదానందానికి ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.