కారేపల్లి, మే 22 : తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున నాలుగున్నర లక్షల ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న నిర్మాణం పూర్తి చేసుకున్న వెయ్యి ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మిగతా వాటిని విడతల వారీగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి ద్వారా రైతులకు పూర్తి భరోసా లభిస్తుందన్నారు. తాసీల్దార్ స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి భూ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తారన్నారు. గతంలో మాదిరిగా వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. సర్వేయర్లకు కూడా శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.