లక్ష్మీదేవిపల్లి, మే 17 : ఏటా వేసవిలో గిరిజనులు ప్రకృతి సంపదగా భావించే తునికాకు(బీడీ ఆకు) సేకరణ షురువైంది. వయసుతో నిమిత్తం లేకుండా తెల్లవారుజామునే అడవిలో కలియతిరుగుతూ ఆకు సేకరణకు పూనుకోవడంతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు నెల రోజులపాటు గిరిజనులకు చేతినిండా పని లభించనున్నది. ప్రస్తుత వేసవిలో రోజురోజుకూ ఎండలు మండిపోతుండడంతో మసక మసక చీకట్లోనే వేకువజామునే అడవిబాట పడుతున్నారు. ప్రూనింగ్ చేసిన చెట్ల నుంచి తునికాకులను సేకరించి ఉదయం 9 గంటల్లోపు ఇళ్లకు చేరుకుంటున్నారు. తర్వాత ఇంటిపట్టునే నీడన కూర్చొని ఆకులను కట్టలుగా కడుతున్నారు. 50 ఆకుల కట్టకు ప్రభుత్వం రూ.3 చొప్పున చెల్లిస్తుండటంతో ఆకు సేకరణకు మరింత పోటీ ఏర్పడింది. ఆకుల కట్టలను సాయంత్రం సమీపంలోని కల్లాల వద్దకు తీసుకెళ్లి కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. ఆకుల కట్టలను కల్లాల్లో వారం రోజులపాటు ఆరబెట్టిన తర్వాత వాటిని బస్తాల్లో నింపి సంబంధిత కాంట్రాక్టర్లు గోడౌన్లకు తరలిస్తున్నారు.
తునికాకు సేకరణ పనులతో కార్మికులకు సుమారు నెల రోజులపాటు చేతినిండా పని, పనికి తగ్గ వేతనం కూడా లభిస్తున్నది. ఏజెన్సీలో ఏటా తునికాకు సీజన్లో మార్చి నుంచి ప్రూనింగ్ పనులు మొదలు పెడతారు. అంటే.. అడవిలో ఉన్న తునికి చెట్ల మండలు కొడతారు. 40 రోజుల తర్వాత ఆ ప్రదేశంలో తునికాకు ఏపుగా చిగురిస్తుంది. అలా పెరిగిన ఆకును కార్మికులు చెట్టూ పుట్టా తిరిగి సేకరిస్తారు. మండ కొట్టడంతో ప్రారంభమైన తునికాకు సేకరణ కల్లాల్లో ఆరబెట్టడం, ఉల్టాపల్టా (ఒకవైపు ఆరిన ఆకును మరోవైపునకు తిప్పడం), తర్వాత ఆరిన ఆకులను బస్తాల్లో నింపి కాంట్రాక్టర్లు గోడౌన్‌కు తరలిస్తారు. ఇలా తునికాకు కార్మికులకు నెల రోజులపాటు పని లభిస్తుంది. తమ గ్రామాల నుంచి సుమారు పది కిలో మీటర్ల వరకు అటవీ ప్రాంతానికి వెళ్లి ఆకు సేకరణ చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.
కాంట్రాక్టర్ల ద్వారా 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ధర పెంచడంతో తునికాకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఇంటిల్లిపాదీ ఆకు సేకరణకు వెళ్తున్నారు. ప్రతీ కార్మికుడు రోజుకు 100 నుంచి 500 కట్టల వరకు వారి శక్తిని బట్టి తీసుకొస్తున్నారు. కార్మికులు రోజుకు రూ.200 నుంచి రూ.700 వరకు ఆదాయం పొందగలుగుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 6 ఫారెస్టు డివిజన్ల పరిధిలో ఆకు సేకరణ చేపట్టారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని ఫారెస్టు డివిజన్లుగా ఉన్నాయి. 30 యూనిట్లలో 667 కల్లాలను సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఆరు డివిజన్లలో 35వేల స్టాండర్డ్ బ్యాగులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దాదాపు రెండు వారాల నుంచి తునికాకు సేకరణ జరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 15వేల స్టాండర్డ్ బ్యాగులను సేకరించినట్లు తెలుస్తోంది. మరో 15వేల బ్యాగుల ఆకు సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా పనులను కాంట్రాక్టర్లు, అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఏడాది అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి ఆకు నాణ్యత బాగుంది. సేకరణ కూడా ముమ్మరంగా సాగుతోంది. ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల ఆకు సేకరణ సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వేళల్లో మాత్రమే ఆకు సేకరణకు వెళ్లి ఎండ పెరగకముందే ఇళ్లకు చేరుకుంటే మంచిది.
– లక్ష్మణ్ రంజిత్‌నాయక్, డీఎఫ్‌వో