పోడు సమస్యకు చరమగీతం పాడి కొత్త చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్న గిరిజన రైతుల కన్నీళ్లను తుడిచి చేతిలో పోడుపట్టాలు పెట్టడంతో వారి కండ్లల్లో ఆనందం వెల్లివెరుస్తున్నది. తరతరాలుగా నిలిచిపోయే స్థిరాస్తి ఆ కుటుంబాలకు సొంతం కావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,51,195 ఎకరాలు 50,595 మందికి పంపిణీ చేశారు. వానకాలం పంటకు సంబంధించిన రైతుబంధు సొమ్ము సైతం రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేయడంతో గిరి‘జనం’ సంతోషంగా సాగు చేసుకుంటున్నారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోడు పట్టాలడిగితే దోషులను చూసినట్లు చూసేవారు. ఇక పట్టాలు వస్తాయని అనుకోలేదు. కానీ.. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాకు నాలుగెకరాల భూమికి పట్టా వచ్చింది. మమ్ములను భూములకు యజమానులను చేశారు. సీఎం కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం. పోడు భూమి తప్ప మాకు మరే బతుకు దెరువు లేదు. ఇన్నాళ్లకు మా బాధలు తీరాయి. పట్టా వచ్చినంక రైతుబంధు కూడా పడింది. ఇప్పుడు వ్యవసాయాన్ని ధైర్యంగా చేస్తున్నం.
భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)/సారపాక/ ఇల్లెందు, అక్టోబర్ 25 : అడవిని నమ్ముకొని జీవిస్తున్న రైతన్నల ఇంట ఆనందం వెల్లివిరుస్తున్నది. ఎంతోకాలంగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వడంతో వారి సంతోషానికి హద్దులేకుండా పోయింది. ఎన్నో సమస్యలను అధిగమించిన గిరిజన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి వారి సమస్యకు చరమగీతం పాడి పూర్తిగా విముక్తి కల్పించారు. ఒకరుకాదు ఇద్దరుకాదు ఏకంగా 50 వేల మందికిపైగా గిరిజన రైతులకు పోడుపట్టాలు పంపిణీ చేశారు. గత జూన్లో ఈ చరిత్రాత్మక ఘట్టానికి తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసింది.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నామమాత్రంగా పోడుపట్టాలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. నాటినుంచి నేటివరకు గిరిజనులకు ఎలాంటి పోడు పట్టాలు ఇవ్వకపోవడంతో మన్యం పోడు సమస్యతో అతలాకుతలమైంది. ఎంతోమంది గిరిజనులు విల్లంబులు చేతబట్టి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. ప్రజాప్రతినిధులు గిరిజనులపక్షాన ఉన్నా అప్పటి అధికారులు, ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. 2008 నుంచి 2012 వరకు అప్పటి ప్రభుత్వం కేవలం 24వేల మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద మొత్తంలో పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారి. చిక్కుముడిగా ఉన్న పోడు సమస్యకు సీఎం కేసీఆర్ చక్కటి పరిష్కారం చూపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50,595 మంది పోడు రైతులకు 1,51,195 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.
01
అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్న భద్రాద్రిలో 726 హ్యాబిటేషన్ పరిధిలో 332 గ్రామ పంచాయతీలు. అందులో 21 మండలాల్లో రైతులు పోడు సాగు చేస్తున్నారు. ఇందులో గిరిజనులు 65,616 మంది 2,41,107 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్నారు. ఇతరులు 17,725 మంది 58,161 ఎకరాల్లో పోడు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఫారెస్టు కమిటీ సర్వే చేసి కచ్చితంగా పోడు సాగు చేసుకుంటున్న రైతులను గుర్తించి అర్హుల జాబితాను సిద్ధం చేసి పట్టాలు ఇచ్చింది.
పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు తెలంగాణ సర్కారు పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు గత ఐదేళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుబంధు అందజేసింది. కొత్తగా పోడు పట్టాలు అందుకున్న రైతులకు కూడా వానకాలం పంటకు రైతుబంధు సొమ్ము వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో గిరిజన రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఒకవైపు రైతులన్నీ అన్నివిధాలా ఆదుకుంటూనే అడవిని కాపాడుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భవిష్యత్లో అటవీ భూముల జోలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు గిరిజనులు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. గిరిజన సంఘాల నాయకులు కూడా దీనికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పోడుపట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఇబ్బందులు పడ్డ గిరిజనుల పోడు భూములకు పట్టాలిచ్చి సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. జిల్లాలోనే అత్యధికంగా ఇల్లెందు నియోజకవర్గంలో గిరిజన రైతులు పట్టాలు అందుకున్నారు. నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఇంతపెద్ద ఎత్తున అటవీ భూమిపై హక్కులు కల్పించలేదు. గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్. అందుకే దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మనల్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ను రానున్న రోజుల్లో ఆశీర్వదించాలి.
1. పోడు పట్టా వచ్చిన వెంటనే ధరణిలో పేరు నమోదై చేతికి పాస్బుక్ వచ్చింది. ఆ భూమికి యజమానిగా మారాడు.
2. బ్యాంకులో నేరుగా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి.
3. దురదృష్టవశాత్తు పోడు రైతు చనిపోతే రూ.5 లక్షల రైతుబీమా వర్తింపు.
4. అటవీ శాఖ అధికారుల వేధింపులుండవు. గతంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తారు.
5. తండ్రి నుంచి కొడుకుకు, భర్త నుంచి భార్యకు
ఇలా తరతరాలుగా వారసత్వ హక్కు.
6. దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తారు.
7. ప్రభుత్వం నుంచి సబ్సిడీపై వచ్చే స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువుల వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
8. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే పరిహారం పొందవచ్చు.
9. వ్యవసాయ మార్కెట్ కమిటీ, కోఆపరేటివ్ సొసైటీల్లో పదవులకు అర్హులు.
10. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా బ్యాంకుల్లో పంట రుణానికి అర్హులు.
పోడు సాగు చేసుకుంటున్న మాకు సీఎం కేసీఆర్ పట్టాలిచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపారు. గతంలో నిత్యం పోలీసు, అటవీ అధికారుల కేసులు ఎదుర్కొనేవాళ్లం. ఆ భూములపై హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వడంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఆయన పాలనే రావాలని కోరుకుంటున్నాం.
30 ఏళ్ల క్రితం నుంచి 4.03 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకున్నాను. ఆ భూమిని కాపాడుకోవడం కోసం ఎన్నో ఏళ్లుగా మా కుటుంబమంతా పోరాటం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఆ భూమికి హక్కుపత్రం కల్పించడంతో మా కుటుంబంలో సంతోషం నెలకొన్నది. నా జీవితాంతం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాను. ఆయనను ఎప్పటికీ మరువను.
సీఎం కేసీఆర్ హయాంలో పోడు పట్టా రావడంతో నా జన్మ ధన్యమైంది. పోడు వ్యవసాయం చేసే రైతుల సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్ పట్టాలు అందించడంతో ఇప్పుడు అటవీ అధికారులతో ఆ గోస తప్పింది. మాపై పెట్టిన కేసులను కూడా సీఎం కేసీఆర్ తొలగించారు. పోడు రైతుగా నిజమైన రైతులతో కలిసి వ్యవసాయం చేసే అదృష్టం మాకు దక్కింది. రైతుబంధు కూడా ఇవ్వడం ఆనందాన్ని కలిగించింది.- పాయం సీతమ్మ, పోడు రైతు, దబ్బనూతల కొత్తూరు, దుమ్ముగూడెం మండలం
తెలంగాణ ప్రభుత్వంలో పోడు చేసుకుంటున్న మాకు పట్టాలు అందించడంతో పోడు భూమికి నేను యజమాని అయ్యాను. ఇది వరకు అటవీ శాఖ అధికారులతో గోసపడ్డాం. ఎన్నో గొడవలు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మా బాధలను గుర్తించి పోడు భూములకు పట్టాలు అందించారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
నేను 35 ఏళ్ల క్రితం పోడు కొట్టాను. గతంలో ఆ భూమికి పట్టా కోసం దరఖాస్తు ఎన్నోసార్లు పెట్టుకున్నా. ఏళ్లు గడిచినా పట్టా రాలేదు. నేను బతికుండగా పట్టా వస్తుందనుకోలేదు. సీఎం కేసీఆర్, విప్ రేగా కాంతారావులు దేవుడిలా వచ్చి పట్టా వచ్చేలా చేశారు. నాకు 6.7 ఎకరాల పోడు భూమికి పట్టా వచ్చింది. సంతోషంగా పోడు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా.
పోడు నరికిన కష్టం ఊరికే పోదు. ఎప్పటికైనా మా కోసం ఆలోచించే నాయకుడు ఉంటాడని అనుకున్నాం. అదే విధంగా మా కోరిక నెరవేరింది. సీఎం కేసీఆర్ సారు మాపై దయతో పట్టాలు అందించారు. రైతుబంధు కూడా వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం సారు కాళ్లు మొక్కుతాం.
పోడు భూములకు పట్టాలు లేక ఎన్నో ఏళ్లుగా రందిపడ్డాం. ఎంతో మందికి మొరపెట్టుకున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పోడు రైతుల కష్టాలను గుర్తించి పట్టాలు అందించి పోడు రైతులకు దేవుడయ్యారు. అటవీ అధికారులు, సిబ్బందితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పోడు భూమికి యజమానిగా మారాం. పోడు రైతులకు రైతుబంధు కూడా వర్తింపజేయడం ఆనందాన్నిచ్చింది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
ఏళ్ల తరబడి సాగు చేసినా పట్టాలు రావనుకున్నాం. భూమి విషయంలో ఎన్నోసార్లు అధికారులతో గొడవలు పడ్డాం. మా అయ్యలపై కేసులు కూడా పెట్టారు. అడవికి వెళితే అటవీ శాఖ అధికారులు బెదిరించేటోళ్లు. ఏళ్లపాటు చాలా కష్టాలు పడ్డాం. ఇంతకాలానికి పట్టాలు రావడంతో అందరు రైతులతో సమానంగా పంటలు సాగు చేసుకుంటున్నాం. నిజంగా మా పాలిట సీఎం కేసీఆర్ సారు దేవుడు.
సీఎం కేసీఆర్ నిజంగా మొనగాడే. పోడు భూముల విషయంలో ఎన్ని గొడవలు జరిగినా మేము భూములను వదల్లేదు. ఇన్నేళ్లకు సీఎం కేసీఆర్ మాపై కనికరం చూపి పోడు భూములకు పట్టాలు ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేం. గిరిజనులమంతా తెలంగాణ వైపే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో మేమంతా సీఎం కేసీఆర్ వైపే.
మా జీవితాలకు ఇదే పెద్ద వరం. దేవుడు వరం ఇచ్చినట్లు చేతికి పట్టాలు అందాయి. ఎన్నో ఏళ్ల సమస్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిష్కారమైంది. తెలంగాణ రావడం వల్లే మాకు పట్టాలు వచ్చాయనుకుంటున్నాం. పట్టాలు తీసుకున్న తర్వాత మా గూడేల్ల్లో పండుగ చేసుకున్నాం. పోడు భూముల్లో పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.
అడవిలో వ్యవసాయం చేయొద్దని అధికారులు అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారు. వర్షాకాలంలో అటవీ శాఖ అధికారులతో రోజూ గొడవలు జరిగేవి. కానీ.. సీఎం కేసీఆర్ నాకున్న మూడెకరాల పోడు భూమికి పట్టాలు అందించి ఆదుకున్నారు. రైతుబంధు డబ్బులు కూడా జమ అయ్యాయి. గిరిజనులను ఆదుకున్న దేవుడు కేసీఆర్ను ఎప్పటికీ మరచిపోలేం.
గత ప్రభుత్వంలో మమ్ములను అనేక ఇబ్బందులకు గురి చేశారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న మాపై అనేక దాడులు చేశారు. అటవీ, పోలీసు అధికారులు నిత్యం వేధింపులకు గురిచేశారు. భూమి నుంచి వెళ్లగొట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపారు. అడవులు తరిగిపోవడానికి నాటి ప్రభుత్వాలు కారణమైనప్పటికీ మమ్ములను దోషులుగా నిలబెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం నాకున్న ఐదెకరాలకు సీఎం కేసీఆర్ సార్ పట్టా ఇచ్చారు. ఇప్పుడు అధికారుల వేధింపులు, బెదిరింపులు లేవు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. కేసీఆర్ సార్కు రానున్న రోజుల్లో అండగా ఉంటాం.