మధిర, సెప్టెంబర్ 20 : మధిర నియోజకవర్గ పరిధిలోని మధిర, చింతకాని, బోనకల్లు, ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో మట్టి, ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అభివృద్ధి పనుల పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం.. కొన్ని కిలోమీటర్ల పరిధిలోనే మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తారు. కానీ, ఇక్కడి మట్టి మాఫియా 50 కిలోమీటర్ల పైబడి దూరం వరకు మట్టిని తరలిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారికి అనుమతులు ఉన్నాయని చెప్పి అధికారులే అక్రమార్కులకు వెన్నుకాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మధిర మండలంలోని సిరిపురం గుట్ట నుంచి టిప్పర్ల ద్వారా వేలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదు. బోనకల్లు మండలంలోని లక్ష్మీపురం, చిరునోములలో గుట్టల నుంచి ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వి రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మధిర సీఐ, ఎస్సై, రెవెన్యూ అధికారులు దాడులు చేసి లక్ష్మీపురం వద్ద మట్టిని తరలిస్తున్న ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకుని మైనింగ్ అధికారులకు అప్పగించారు.
చింతకాని మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులకు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారనే ఫిర్యాదులు జిల్లా అధికారులకు అందాయి. విచారణ జరిపిన కలెక్టర్, సీపీలు చింతకాని తహసీల్దార్, ఎస్ఐలను బదిలీ చేశారు. మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, బోనకల్లు మండలాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ మట్టి, ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు.